భూతల స్వర్గం..... గో.... గో....గోవా

గోవా... భూతల స్వర్గం. డబ్బులుంటే స్వర్గం చేతిలోనే ఉంటుంది. డబ్బులు లేకున్నా కేవలం సముద్ర అలలను చూసీ ఆనంద పడవచ్చు. హద్దూ, అదుపుల్లేని విచ్చలవిడి తనం, ఎక్కడ పడితే అక్కడ దొరికే మద్యం. లక్షల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేయించే కాసినోలు, పబ్బులు, మసాజ్ సెంటర్లు, డాన్స్ బార్ లు, హిప్పీలు, బీచ్ లలో అన్నీ మరచి సేద తీరే పాశ్చాత్యులు, ఇవ్వన్నీ తమకు సంబంధం లేనట్టుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే బీహారీలు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు.బట్టలను అతి పొదుపుగా వాడే ఆధునికులు, విధ్యుత్ లైట్ల వెలుగుల్లో జిగేల్ మనే జీవితాలు, ఆ లైట్ల వెనుక చీకటి కోణంలో ఉండే జీవితాలు. ఇవ్వన్నీ తమకేమీ పట్టనట్టుగా ఉండే గోవా ప్రజలు. ఇదీ, స్థూలంగా గోవా జీవన చిత్రం. మనం, సంస్కృతీ సంప్రదాయాల కు నెలవుగా భావించే భారత దేశంలోనే ఉన్నామా,,? అనే మీమాంస గోవా ను మొదటి సారి సందర్శించే వారికి వచ్చే డౌటానుమానం. అయితే, ఇవ్వన్నీ పక్కకు పెడితే జీవితంలో కనీసం ఒకసారైనా సందర్శించాల్సిన పర్యాటక,పాశ్చాత్య, సాంస్కృతిక, హెరిటేజ్ ప్రాంతం గోవా. అందుకే గో..గో..గోవా అంటూ మూడురోజుల టూర్ ప్లాన్.

గోవా కు వెళ్లేందుకు పదిరోజులకు ముందుగా ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసి మనం గోవా... వెళ్తున్నాం అని మిత్రులు వేణు గోపాల్ రెడ్డి, గణేష్, బ్రాహ్మాజీ, రాముడు, శ్రవణ్, రమేష్ లు చెప్పారు. అప్పటికే నాకు వారం రోజులుగా అనారోగ్యంగా ఉండడం, వెళ్లేందుకు అసలు ఇష్టం లేదు. ఫిబ్రవరి 9 న సాయంత్రం 6 గంటలు ఫ్లయిట్. దగ్గు, జ్వరం తగ్గినప్పటికీ అనుమానంతో ముందు రోజు ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించు కున్నాను. రిపోర్ట్ నెగెటివ్ వచ్చింది. ఇంకే, తెల్లారి అందరితో.. ఇండిగో ఫ్లయిట్ లో చలో గోవా.... 
పూర్తిగా ఆర్మీ పాలనలో ఉండే గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 9 గంటలకు దిగాం. హైదరాబాద్ ను పోల్చితే గోవా ఎయిర్ పోర్ట్ లో కనీసం పదవ వంతు కూడా ట్రాఫిక్ లేదు.
ముందుగానే చేసుకున్న ఏర్పాటు ప్రకారం, మాకోసం వాహనం వచ్చి ఉంది. ఎయిర్పోర్ట్ నుండి మేము వెళ్లాల్సిన ఆరంభోల్ బీచ్ సమీపంలోని గెస్ట్ హౌస్ 60 కిలోమీటర్లు. మొత్తానికి గోవా సిటీ మొత్తం తిప్పి రాత్రి చిన్న, చిన్న సందుల గుండా తిప్పి ఒక ఇరుకు గల్లీ వద్ద కార్ ఆపి, అక్కడే ఉన్న ఒక పిల్లవాడు మిమ్ముల్ని రూమ్ ల వద్దకు తీసుకెళ్తాడు అని 2 వేల రూపాయలు తీసుకొని డ్రైవర్ వెళ్ళిపోయాడు. హైదారాబాద్ పాత బస్తీ కన్నా అద్వానంగా ఉన్న గల్లీ లనుండి తిప్పి ఇదే మీ గదులు అని చెప్పివెళ్లిపోయాడు. పేరుకు బీచ్ ఎదురుగానే ఉన్నప్పటికీ థర్డ్ రేట్ రూమ్స్ అవి. రూమ్ తలుపు తీయగానే, ఆ గదిలోని బెడ్ పై ఒక పిల్లి పడుకొని ఉంది. వచ్చిన బాయ్, దానిని చూడగానే, చెవులదాకా నవ్వి కిటికీ తీసి ఉన్నది కాబట్టి వచ్చింది అని చెప్పి దానిని వెళ్లగొట్టి వెళ్ళిపోయాడు. మేము, కొద్దిగా ఫ్రెష్ అయి ఎదురుగా ఉన్న ఆరంభోల్ బీచ్ కు వెళ్లాం.
మొత్తం గోవాలో అధిక శాతం ఫారెనర్స్ ఉండే బీచ్ అట అది. కరోనా ప్రభావం బాగానే కనపడింది. పెద్దగా ఊహించినంత పర్యాటకులు లేరు. బీచ్ ఒడ్డున కూర్చొని ఆ అందమైన అలలను, అలల సప్పుళ్ళు, ముందుకు ఉరికి వచ్చేలా వచ్చే సముద్రపు అలలు, అంతే వేగంగా వెనాకు వెళ్లే అలలు,. చల్లని గాలులు ఎంజాయ్ చేస్తూ రాత్రి రెండు గంటల వరకూ గడిపాము. మేము నిద్రపోయినా, బ్రాహ్మాజి, గణేష్ లు మాత్రం మూడు గంటల వరకు చల్లటి పానీయాలతో సముద్ర అలలను, గాలులనూ మరింత ఆస్వాదించారు.. 


 

 
తెల్లారి, 10 న ఉదయం మరోసారి బీచ్ కు వెళ్లి సముద్ర స్నానం చేసి తిరిగి రూమ్ వచ్చి ఆ రూమ్ లను కాళీ చేసి కాలంగూట్ సమీపంలో సింక్ క్యూ అనే హోటల్ లో రూమ్స్ తీసుకున్నాం. డబ్బులు ఎక్కువైనా చాలా బాగున్నాయి. మంచి స్విమ్మింగ్ పూల్ అందులో ఉంది. అప్పటి దాకా బీచ్ లో స్నానం చేసినా తిరిగి ఆ స్విమ్మింగ్ పూల్ లో మళ్ళీ గంటకు పైగా డ్రింక్స్ ను ఎంజాయ్ చేస్తూ ఈత కొట్టారందరూ. హోటల్ పక్కనే, జార్జి డి-సౌజా అనే హోటల్ ఉండగా, ఆహోటల్ లో ఇష్టమైన అన్ని డిషెస్ చేయించుకొని తినడం, ఎవరి ఇష్టమైన డ్రింక్స్ వారు తాగాం. ఇక్కడి హోటల్లో ఒక విచిత్రమైన గడియారం (వాల్ క్లోక్ ) ఉంది. ఈ గడియారం డెన్మార్క్ కు చెందిన ఒక పర్యాటకుడు తనకు గిఫ్ట్ గ ఇచ్చాడని, దీనికి నెంబర్లు ఉల్టా ఉంటాయని తెలిపాడు. రాత్రి తన హోటల్ కు వచ్చి డ్రింక్స్ తాగే వారు సమయం చూస్తే రాత్రి పన్నెండున్నర అయినా ఈ గడియారంలో 11 గంటలలోపే సమయం చూపిస్తుందని చెప్పాడు. దానితో మరింత కాలం గడుపుతారని దానితో బిసినెస్ మరింత ఎక్కువవుతుంది చెప్పాడు. ఆ వాల్ క్లాక్ ఫోటోలను తీసుకున్నాం. అనంతరం, సాయంత్రం కాలంగూట్ పక్కనే ఉన్న భాగా బీచ్ లకు వెళ్లాం. రాత్రి వరకు ఆ బీచ్ లలో గడిపి అక్కడే ఉన్న డాన్స్ సెంటర్లలో డాన్స్ చేసి తిరిగిరాత్రి పదిన్నరకు గెస్ట్ హౌస్ చేరుకున్నాం. ముచ్చట్లు, డ్రింక్స్, ఫుడ్ కార్యక్రామాలు అయిపోయాక తెల్లారి ప్రోగ్రామ్ ఫైనల్ చేసుకొని షరా మామూలుగానే ఒంటిగంట తర్వాత పడుకున్నాం. 


 
11 న సోమవారం, హోటల్ రూమ్స్ కాళీ చేసి గోవాలోని, ఫోర్ట్, గోవా చర్చ్, మ్యూజియం, ఇతర ప్రాంతాలను చూపించి చివరకు ఎయిర్పోర్ట్ లో దించడానికి మూడున్నర వేలకు టాక్సీ మాట్లాడుకున్నాం. డైరెక్ట్ గా గోవా బీచ్ ఫోర్ట్ కు వెళ్లాం. భారత పురాతత్వ శాఖ నిర్వహణలో ఆ ఫోర్ట్ ఉంది. గోవా ఏ.ఎస్.ఐ సీనియర్ అధికారిగా ఉన్న మిత్రుడు సాంబ శివకుమార్ కు ఫోన్ చేసాను. వెంటనే, స్పందింది అక్కడే ఉన్న ఫోర్ట్ సిబ్బందికి చెప్పి ఫోర్ట్ లోని అన్నింటినీ చూపించాడు. ఫోటోల కార్యక్రమం అయిన తర్వాత ఓల్డ్ గోవా లో లంచ్ అయినా తర్వాత మ్యూజియం ను సందర్శించాం. ఒక గైడ్ ను మాట్లాడు కోగా ఆయన మొత్తం గోవా చరిత్ర, పోర్చుగీస్ లు ఎలా వచ్చారు ఎలా దేవాలయాలు, బౌద్ధ ఆరామాలను ధ్వసం చేశారు. గోవా చర్చ్ ప్రత్యేకతలు...ఇలా మొత్తం చరిత్ర ను వివరించాడు. రెండువందల పోయినా పరవాలేదు కానీ విలువైన సమాచారం తెలుసుకున్నామనే తృప్తి మిగిలింది. దీనితర్వాత, చివర మీరామాల్ అనే బీచ్ కు వెళ్లాం. ఇతర బీచ్ ల కన్నా ఈ బీచ్ చాలా ప్రశాంతంగా, పెద్దగా అలలు లేకుండా ఉంది. రాత్రి 7 గంటలవరకు అక్కడేవుండి అక్కడినుండి గోవా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాం. పూర్తిగా ఆకలితో ఉన్నాం, గోవా ఎయిర్పోర్ట్ లోని క్యాంటీన్ లో ఒక ఇడ్లీ రూ.260 మాత్రమే. దీనితో, అందరం ఏమీ తినకుండా రాత్రి హైదరాబాద్ లో దిగేవరకు రాత్రి 11 .45 అయ్యింది. ఇంకేం అందరం ఆకలితో నక నక లాడుతూ, హోటల్ కోసం చూసి చివరకు పన్నెండున్నరకు టోలిచౌకి బహార్ కేఫ్ కు చేరుకొని మటన్ బిర్యాని తిని రాత్రి రెండు గంటలవరకల్లా ఇంటికి చేరుకున్నాం. మొత్తానికి, మూడు రోజుల గోవా ట్రిప్ ఎన్నో మధుర స్మృతులను, అనుభూతులను నింపడమే కాకుండా రోజు వారి పని ఒత్తిడి నుండి రిలాక్స్ కావడానికి ఉప యోగపడ్డాయి. ( గోవాలో చారిత్రక, పర్యాటక ప్రదేశాలు, వాటి ప్రత్యేకతలు, చరిత్ర మరో ఎపిసోడ్ లో తెలుసుకుందాం. 
 కన్నెకంటి వెంకట రమణ
సంయుక్త సంచాలకులు,
 సమాచారశాఖ.9849905900


             Read second part -2

విలాసమే కాదు విజ్ఞాన ప్రదేశాలూ ఉన్నాయి...గోవాలో

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు