సిఎం కెసిఆర్ భందువుల కిడ్నాప్ కేసులో ఏపి మాజి మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు

 



ఆమె ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చిన మహిళ. పైగా మాజి మంత్రి. భూవివాదంలో తెలంగాణ సిఎం భందువులనే ఏకంగ కిడ్నాప్ చేయించి చుక్కలు చూపించింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన కిడ్నాప్ ను పోలీసులు సవాల్ గా తీసుకుని 6 గంటల్లోనే ఛేదించారు.

బోయిన్‌పల్లిలో సిఎం కెసిఆర్ భందువుల కిడ్నాప్ కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ రావు, అతని సోదరులు నవీన్ రావు, సునీల్ రావులతో అఖిలప్రియకు భూవివాదం నడుస్తోంది.
హఫీజ్ పేట్ లోని 50 ఎకరాల భూ వ్యవహారమే కిడ్నాప్ కు కారణంగా భావిస్తూ ఉన్నారు. ఇదంత సర్కారు భూమనే ఆరోపణలు ఉన్నాయి.

మంగళవారం రాత్రి ప్రవీణ్ రావు ఇంటికి కిడ్నాపర్లు ఐటీ అధికారుల పేరుతో వచ్చి సోదాలు చేశారు. ఇంట్లో నుంచి కొన్ని కీలక డాకుమెటట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులను ఒక రూమ్‌లో బంధించి ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావును బలవంతంగా కిడ్నాప్ చేసి తమతో పాటు తీసుకెళ్లారు.

కారులో తీసుకెళ్లి బలవంతంగా కిడ్నాపర్లు కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకుని తెల్లవారు జామున కిడ్నాపర్లు వీరిని వదిలేశారు. కిడ్నాపర్లలో మాజీ మంత్రి అఖిలప్రియ మరిది చంద్రహాస్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ వెనుక అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె భర్త భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నాడు. ఆళ్లగడ్డకు చెందిన 15 మంది మనుషులతో అఖిలప్రియ ఈ కిడ్నాప్ చేయించిందని తెలుస్తోంది.

సిసి కెమెరా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. పోలీసుల అదుపులో 15మంది నిందితులు ఉన్నారు. కిడ్నాపర్లు ఉపయోగించిన మూడు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తీసుకెళ్లిన ఫోన్స్, హార్డిస్క్, డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

చాలా సంవత్సరాలుగా భూమి విషయంలో ప్రవీణ్ రావు మోసం చేశాడని అఖిల ప్రియ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు