కొత్త రకం వైరస్ భారత్ ను చేరినట్లేనా ?
న్యూఢిల్లీ: కొత్త రకం వైరస్ భారత్ ను చేరిందనే వార్తలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.  బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చిన విమాన ప్రయాణికుల్లో పలువురికి కరోనా సోకగా వీరిలో సగం మందిలో కొత్త రకం వైరస్‌ జాడ ఉండవచ్చని జన్యు నిఫుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బ్రిటన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికులకు పలు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వీరిలో గుర్తించిన కరోనా వైరస్‌ నమూనాలు బ్రిటన్‌లోని కొత్త రకం కరోనా సోకిన 60 శాతం పాజిటివ్‌ కేసుల మాదిరి ఉన్నట్లుగా తెలుస్తున్నది.

ఈ లెక్క ప్రకారం 20 పాజిటివ్‌ కేసుల్లో సగం అంటే సుమారు పది మందికి బ్రిటన్‌లోని కొత్త రకం కరోనా సోకి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. అయితే బ్రిటన్‌ నుంచి నెలల ముందు వచ్చిన వారికి ఇప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వారిలో ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఉండకపోవచ్చని, ఇప్పటికే కొందరి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించి ఉండవచ్చని చెప్పారు. 

బ్రిటన్‌లో తాజాగా గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్‌ భారత్‌లో కూడా అడుగుపెట్టిందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్‌ నుంచి భారత్‌ లోని వివిధ రాష్ట్రాలకు వచ్చిన విమాన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  బ్రిటన్‌ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన వారిలో ఆరుగురికి, ఆదివారం రాత్రి కోల్‌కతాకు వచ్చినవారిలో ఇద్దరికి, మంగళవారం అహ్మదాబాద్‌ వచ్చినవారిలో నలుగురికి, పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సోమవారం వచ్చినవారిలో విమాన సిబ్బందిలోని ఒకరు సహా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

 నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 22వ తేదీ వరకు యూకే నుంచి భారత్‌ వచ్చిన వారందరి వివరాలను సేకరిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినట్లయితే వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా చేపడుతామని స్పష్టంచేశారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఆయా రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.

కాగా బ్రిటన్‌లో కొత్త రకం కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. డిసెంబర్‌ 31, నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించింది. తాజా వైరస్‌ ముప్పుపై బ్రిటన్‌ నుంచి రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌ కూడా బుధవారం నుంచి డిసెంబర్‌ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. 

కర్నాటక రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం రాత్రి 10 గంటల నుంచి అమలులోకి రానున్న కర్ఫ్యూ నిబంధనలు ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతాయి. జనవరి 2వ తేదీ వరకూ ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతొంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు