నిజాం స్వర్ణోత్సవ కానుక - వరంగల్ అదాలత్

     

       నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలి ఖాన్ తన 25 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా స్వర్ణోత్సవ కానుకగా అదాలత్   భవణం నిర్మించారు.

       

                                 ఇంకా చెక్కు చెదరని 80 ఏళ్ల భవణం


  అసఫ్ జాహీల వంశంలో చివరి రాజు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన 25 ఏళ్ల పాలన నిశానీగా వరంగల్ లో "అదాలత్" భవనాన్ని నిర్మించారు. ఇరవై అయిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నిజాం నవాబు తన రజతోత్సవ వేడుకలలో భాగంగా రాజ్య పరిధిలో ప్రజలకు ఉపయోగపడే అనేక భవనాలను నిర్మించారు.  హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతంలో అందరినోటా అదాలత్ గా పిలవబడుతున్న ఈ జిల్లా కోర్టు (సెషన్స్ కోర్టు ) నిర్మాణం కూడా అందులో భాగంగా చేసినదే. నిజాములు తమ పాలనలో తీసుకువచ్చిన అనేక మార్పుల్లో భాగంగా న్యాయవ్యవస్థ రూపకల్పన జరిగిన ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ భవన నిర్మాణం జరిగింది.  నాటి అస్ఫజాహీ కట్టడాలకు అద్దంపట్టే రీతిలో ఉన్న ఈ భవన నిర్మాణం జరిగి 80 ఏళ్లకు పైగా అయినప్పటికీ నేటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

        నిజాం ప్రభుత్వం ఇండియన్ యూనియన్ లో కలసిన తర్వాత అంతవరకూ కేంద్ర స్థాయిలో ఉన్న సదర్-ఏ-అదాలత్ లను జిల్లా కోర్టులుగా మార్చారు. ఆ విధంగా ఏర్పడిందే వరంగల్ జిల్లా న్యాయస్థానం. అప్పటివరకు జిల్లా కోర్టులుగా పిలిచిన వాటిని సబ్- కోర్టులుగా, సబార్డినేట్ జడ్జీలను జిల్లా మేజిస్ట్రేట్లుగా హోదాలను మార్చారు. 1956 లో  ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్లకు జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యతలను అప్పగించారు. జిల్లా సెషన్స్ జడ్జీలు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ల అధీనంలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ లు పనిచేసే విధంగా మార్పులు తీసుకువచ్చారు.

        మొఘల్స్ , బహమనీలు ఆ తర్వాత అసప్ జాహీల పాలనా కాలాల్లో ప్రజల తగాదాలను, వివాదాలను తీర్చే విషయంలో ప్రత్యేక న్యాయస్థానాలుండేవి కావు. 18 వ శతాబ్దం వరకూ గ్రామాల్లో సివిల్ తగాదాలు, వివాదాలను గ్రామాలోని పటేళ్లు, స్థానిక పెద్దలే తీర్చేవారు. వీరి స్థాయికి మించిన తగాదాలను 'సుబాహ్' పరిధిలో ఖాజీ లేదా సుబేదారులు తీర్పు చెప్పేవారు. ఆవిధంగా నిజాం కాలంలో ప్రజల వివాదాల పరిష్కారానికి వరంగల్ సుబా లో ఖాజీ నియామకం జరిగింది. ఖాజీ నివాస ప్రాంతం కావడం చేత ఇవ్వాళ మనం పిలుస్తున్న కాజీపేట (ఖాజీపేట) కు ఆ పేరు వచ్చింది. ప్రజలకు న్యాయమందించేందుకు ఆనాడు వ్యవస్థలో అనేక మార్పులు చేసినప్పటికీ చివరిగా నిర్ణయాధికారం మాత్రం నాటి ప్రభువులకే ఉండేది. ఒకటవ సాలార్ జంగ్ ప్రధానిగా పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత ఈ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చారు. హైదరాబాద్ చివరి నవాబు కాలానికి ఒక విధంగా ఈ వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి.అలా, మారుతూ వచ్చిన న్యాయ పాలనా విధానంలో భాగంగా క్రీ.శ. 1912  లో వరంగల్ సుబా పరిధిలో ప్రత్యేక న్యాయ స్తానం  ఏర్పడింది.  హన్మకొండ లష్కర్ బజార్ లోని మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారిగా మున్సిఫ్ కోర్టు పేరిట ఈ న్యాయ శాఖ వేళ్లూనుకుంది.

          ప్రస్తుతమున్న జిల్లా కోర్టు భవన నిర్మాణం జరిగే వరకు దాదాపు ఇరవై రెండేళ్లవరకు మున్సిఫ్ కోర్టు మర్కజీ పాఠశాల భవనంలోనే కొనసాగింది. ఈ వ్యవస్థలో తాలూకా స్థాయిలో సివిల్ జడ్జీలను, మున్సిఫ్ జడ్జీలను నియమించారు.అప్పటికీ పదివేల రూపాయలకన్నా ఎక్కువకలిగిన ఆస్తి తగాదాలు, క్రిమినల్ నేరాలను నిజాం నవాబే పరిష్కరించేవారు. తమ కేసులను నిజాం ద్వారానే పరిష్కరించుకునేవారికోసం 1914 లో ఒక ప్రత్యేకమైన జుడీషియల్ కమిటీ కూడా ఉండేది. 1915 లో కోర్టు వివాదాలకు సంబందించిన నిబంధనలను రూపొందించారు. ఆ కాలంలో అట్టడుగున 'నిజామత్' న్యాయస్థానం ఉండేది. ఈ న్యాయస్థానంలో క్రిమినల్ కేసులు విచారించేటప్పుడు దాన్ని 'అదాలత్-ఏ-దివానీ' అని పిలిచేవారు. వీటిపై సుబా స్థాయిలో ఏర్పాటు చేసిన 'సదర్ అదాలత్' వరంగల్ కేంద్రం గా ఉండేది. కరీం నగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు సంబంధించి కేసులన్నీ ఇక్కడే పరిష్కరించబడేవి.  మరో ముందడుగుగా 1922 నాటికి జిల్లాలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పూర్తిగా వేరు చేయబడ్డాయి. దీంతో, జడ్జీని నియమించి, జిల్లా కోర్టులన్నింటినీ ఇతని పరిధిలోకి తెచ్చారు.

              బ్రిటిష్ ఇండియా నిర్వహస్తున్న న్యాయస్థానాల తీరులో,  గతంలోని ఖాజీ ల స్థానంలో శాస్త్రీయ విద్యనభ్యసించిన న్యాయాధికారుల నియామకాలు జరుగుతూ వచ్చాయి. 1934 నుండి 1935 వరకు జిల్లా న్యాయాధిపతులుగా పనిచేసిన వారిలో మీర్ బాసిత్ అలీ ఖాన్, హాసన్ అలీ ఉన్నారు.. బార్-ఎట్-లా చేసిన బాసిత్ అలీ ఖాన్ 1934 తర్వాత వరంగల్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు.1918 అక్టోబర్ 21 న నిజాం ప్రభుత్వంలో స్పెషల్ మేజిస్ట్రేట్ గా చేరిన మీర్ బాసిత్ అలీఖాన్ 1933 లో ఔరంగాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి గా భాద్యతలు నిర్వర్తించారు. ఇతను టిప్పు సుల్తాన్ కుటుంబానికి చెందినవాడుగా చెబుతారు. ఆ తర్వాత 1935 లో హాసన్అలీ వరంగల్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. జిల్లా మేజిస్ట్రేటుగా, హైకోర్టు రిజిస్ట్రార్ గా, చీఫ్ సిటీ మేజిస్ట్రేట్ గా ఆయన పలు పదవులు నిర్వహించారు.

        అయితే, ఇటీవలి కాలంలో చూస్తే, వరంగల్ జిల్లా నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో ఏ. రఘువీర్, ఎల్. నర్సింహా రెడ్డి లున్నారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన రఘువీర్ గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గా , ఆసాం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. వరంగల్ జిల్లా గవిచర్ల గ్రామానికి చెందిన ఎల్. నర్సింహా రెడ్డి హైకోర్టు జడ్జిగా, చీఫ్ జడ్జిగా పని చేశారు.

Venkataramana Kannekanti
joint Director I&PR Department
99850-77477



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు