హైదరాబాదీలకు బంపర్ ఆఫర్ - జిహెచ్ఎంసి ఎన్నికల మానిఫెస్టోలో సిఎం వరాల జల్లు


జిహెచ్ఎంసి ఎన్నికల్లో నగర వాసులకు సిఎం కెసిఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా సోమవారం సిఎం కెసిఆర్ పార్టి ఎలక్షన్ మానిపెస్టోను విడుదల చేసారు. బస్తీవాసులకు ఉచితంగా నళ్లా నీళ్లు ఇస్తామన్నారు. సెలూన్లు, లాండ్రీలు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్  ప్రకటించారు. సీనియర్ సిటిజెన్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.  హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చి దిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. లాక్‌డౌన్‌ కాలానికి మోటార్‌ వాహనాల పన్ను రద్దు చేస్తామని తెలిపారు.

'హైదరాబాద్‌ గొప్ప చారిత్రక నగరమని, దేశంలో హైదరాబాద్‌ నిజమైన కాస్మోపాలిటన్‌ సిటీ అన్నారు. హైదరాబాద్‌ అందమైన పూల బొకేలాంటి నగరం. జంట నగరాల్లో ఇప్పుడు నీటి కొరత లేదు. హైదరాబాద్‌కు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాం. త్వరలో సమగ్ర జీహెచ్‌ఎంసీ చట్టాన్ని రూపొందిస్తాం. అధికారుల్లో బాధ్యతను పెంపొందించేలా నూతన చట్టానికి రూపకల్పన చేస్తాం. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. 

హైదరాబాద్ లో నీళ్ల కోసం కోట్లాడుకునే రోజులు లేకుండా చేశాం..గతంలో శివారు ప్రాంతాల్లో వారం రోజులకు, పది రోజులకు, పద్నాలుగు రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితులను మస్తు చూశామన్నారు. వాటర్‌ ట్యాంకర్‌ల వద్ద యుద్ధాలను చూశామన్నారు. అవన్నీ కూడా మిషన్‌ భగీరథ పుణ్యమా అని కనుమరుగై పోయాయన్నారు. కేవలం నగరం వరకే కాకుండా ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉండేటువంటి హెచ్‌ఎండీఏ ప్రాంతానికి కూడా పుష్కలంగా మంచినీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. 

గోదావరి జలాలు మూసీకి తరలించి ప్రక్షాళన చేస్తా మన్నారు. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ విస్తరణ చేపడతామన్నారు. ప్రజారోగ్యానికి ప్రత్యేక దావాఖానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరం నలువైపులా మరో 3 టిమ్స్‌ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. అలానే ఉన్నచోటే అన్ని వసతులు సమకూరేలా "మైక్రోసిటీ" కాన్సెప్ట్‌ అమలు చేస్తామన్నారు. హైటెన్షన్‌ విద్యుత్‌ కేబుళ్లు అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బస్తీల్లో ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు (ఇంగ్లీష్‌), విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్‌లో లైబ్రరీ, క్లబ్‌, యోగా, జిమ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాక వారికి ఉచితంగా బస్‌ పాసులు ఇస్తామన్నారు. త్వరలో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.


 జీహెచ్‌ఎంసీకి సమగ్రమైన చట్టం తీసుకువస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పూర్తిస్థాయిలో అద్భుతంగా, అన్ని రకాల పారదర్శకంగా ఉండేలా, అవనీతి రహితంగా ఉండేలా సమగ్రమైన చట్టం తేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు