నాటి మహబూబ్ బాగ్..... నేటి పబ్లిక్ గార్డెన్


నాటి మహబూబ్ బాగ్..... నేటి పబ్లిక్ గార్డెన్

    

           


హన్మకొండ నడిబొడ్డున మూడు కూడళ్లను కలుపుతూ నగర ప్రజలకు పచ్చదనాన్ని, స్వచ్ఛ మైన గాలిని పంచుతున్న పబ్లిక్ గార్డెన్ కు 95 ఏళ్ళు నిండాయి.  వరంగల్ లో మొట్టమొదటి తోటగా వెలుగొందిన ఈ పబ్లిక్ గార్డెన్ అసలుపేరు "మహబూబ్ బాగ్" అన్న విషయం చాలామందికి తెలియదు. ఏడవనిజాము ఉస్మాన్ అలీ ఖాన్ తన తండ్రి మీరు మహబూబ్ అలీ ఖాన్ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు.అంతేగాక ఈ ప్రాంతమంతా అస్ఫజాహి వంశ పాలనలో రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుర్తుగా అందులో ఒక భవనాన్ని కూడా నిర్మించారు. అసఫ్ జాహి నిర్మాణ శైలికి అద్దంపట్టేలా ఉన్న ఈ భవనాన్ని వరంగల్ ప్రజలు టౌన్ హాల్ గా పిలుస్తున్నారు. వరంగల్ ప్రాంతాన్ని 1724  లో తమ ఆధీనంలోకి నిజముల్ ముల్క్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ 200 ఏళ్ల పాలనకు గుర్తుగా ఈ టౌన్ హాల్ ను నిర్మించారు.

                         *టౌన్ హాల్ నిర్మాణం, గార్డెన్ ఏర్పాటుకు రూ.2 లక్షలు* 


            టౌన్ హాల్ నిర్మాణం 23 ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటుకు రెండు లక్షల రూపాయలను నిజామ్ మంజూరు చేశారు. అయితే,  సుమారు ఏడు ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటుచేసిన ఈ 'భాగ్' (తోట )నిర్మాణానికి 1334 ఫసిలీ ( 1924 )న నాటి కలెక్టర్ మౌల్వీ సయ్యద్ మహమ్మద్ నయిమొద్దీన్ శంకుస్థాపన చేశారు. ఫౌండేషన్ స్టోన్ పై 7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను "ఖాలెద్ ఉల్లాహ్,  మాలిక-ఏ సుల్తానేట్,  షా-ఏ-డెక్కన్ తదితర బిరుదులతో చెక్కించారు.   కాగా, 1343 ఫసిలీ ( 1943 ) రోజున నాటి రాజు నిజామ్ ఉల్ ముల్క్ దీన్ని ప్రారంభించారు. 1936 లో ఈ టౌన్ హాల్ నిర్మాణం అప్పటి తాలూక్దార్ (కలెక్టర్ ) నాయూష్ యార్ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో జరిగింది. తెల్లని రంగులో ఫ్లడ్ లైట్స్ వెలుగులో రాత్రి వేళలో ఈ టౌన్ హాల్ పాల రాతి కట్టడంలా వెలిగిపోతోంది.సుమారు యాభై మంది వరకు సమావేశం కావడానికి వీలయ్యేంత పెద్ద హాలు, ముందు వరండా, రెండు వైపులా చిన్న గదులతో అందంగా కనిపించే ఈ భవనం పైభాగాన ఇరువైపులున్న మీనార్ లు నాటి అసఫ్ జాహీల నిర్మాణ శైలిని, వారి పనితనాన్ని ప్రస్ఫుటిస్తాయి, భవనం మూడు వైపులా విశాలమైన మెట్ల వరుసలు ఈ కట్టడానికే అందాన్ని ఇనుమడింప చేసేవిధంగా ఉన్నాయి.

                               *ప్రకాశం పంతులుచే గాంధీ విగ్రహం ఆవిష్కరణ*

           ఈ గార్డెన్లో ఒకవైపు శాంతిని ప్రభోదించే నిలువెత్తు గాంధీ విగ్రహం, మరోవైపు కనుల విందు చేస్తున్న కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని తెలిపే నిండైన నంది విగ్రహం, సమీపంలోనే స్వాతంత్ర సమరంలో వీరోచితంగా పోరాడిన పలువురు సమరయోధుల పేర్లతో కూడిన రెండు శిలా ఫలకాలను ఏర్పాటు చేశారు. ఇందులోని మహాత్మా గాంధీ విగ్రహం ప్రకాశం పంతులుచే ఆవిష్కరించబడింది.

                                        *తోడ్ పోడ్ ఖాన్...ఇస్మాయిల్ ఖాన్*

              భాగ్-ఏ-ఆమ్ గా పిలిచే ఈ పబ్లిక్ గార్డెన్ గురించిన ఒక చిన్న సన్నివేశాన్ని ఇక్కడ గురు చేసుకోవడం సంజసం. నిజామ్ ప్రభుత్వ అధికారి మీర్జా ఇస్మాయిల్ వరంగల్ లోపర్యటించినప్పుడు ఈ బాగ్-ఏ-ఆమ్ చుట్టూ చాలా పెద్ద ఎత్తున ప్రహరీ గోడ  నిర్మించి ఉండడం చూసి ఆశ్చర్య పోయాడట. ప్రజల కోసం ఏర్పాటు చేసిన గార్డెన్ కనపడనంత ఎత్తులో గోడ ఉండడాన్ని చూసి ఆశ్చర్య పోయాడట. ప్రజల కోసం ఆఏర్పాటు చేసిన గార్డెన్ కనపడనంత ఎత్తులో గోడ ఉండడం చూసి పడగొట్టించాడట. అప్పటినుండి మీర్జా ఇస్మాయిల్ కు తోడ్ పోడ్ (పడగొట్టే )ఇస్మాయిల్ అన్న పేరొచ్చిందని చెబుతారు.


                                  *చిన్న జూ పార్క్  కూడా ఉండెడిది*

     పెద్దలకు విశ్రాంతి విడిదిగా, పిల్లలకు ఆటస్థలంగా ఉన్న ఈ తోటలో చాలా కాలం పిల్లలకు విజ్ఞానం కలిగించే విధంగా జంతు ప్రదర్శన శాల ఒకటి ఉండేది. వరంగల్ మున్సిపల్ చైర్మన్ గా ఉమ్మారెడ్డి ఉన్న కాలంలో రకరకాల జింకలు, దుప్పులు, తాబేళ్లు, కుందేళ్లు, పావురాలు సందర్శకులకు కనువిందు చేసేవి. ప్రస్తుతం అవేవీ అక్కడ కనిపించవు. ఆకాలంలోనే ఏర్పాటుచేసిన బాలల గ్రంధాలయం మాత్రం నేటికీ ప్రత్యేక షెడ్ లోనే కొనసాగుతోంది. దాదాపు శతాబ్దకాలంగా నగర ప్రజలకు ప్రశాంతతను కలుగచేస్తూ నగర నడిబొడ్డున ఉన్న ఈ తోట స్థలం రోజురోజుకు కుచించుకుపోతోంది. ఈ గార్డెన్ కు అన్ని వైపులా ఉన్న రోడ్డును విస్తరించడంతో భాగంగా క్రమేణా దీని స్థలం తగ్గిపోతోంది. గార్డెన్ లోనే వివిధ రకాల నిర్మాణాలు చేపట్టడం కూడా దీని లక్ష్యానికి విఘాతంగా మారింది. ఈ తోటను పరిరక్షించేందుకు గతంలోనే సిబ్బంది కోసం రెండు క్వార్టర్లను కూడా నిర్మించారు. 

                *నగర ప్రజలకు ఏకైక కళా వేదిక నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియం*

 రెండున్నర దశాబ్దాల కింద జాతీయ  నాయకుడు గోవింద వల్లభ పంత్ జ్ఞాపకార్థం ఇందులో ఒక ఆడిటోరియం నిర్మించాలని స్థానిక మున్సిపాలిటీ సంకల్పించింది. దానికి గోవింద వల్లభ్ పంత్ కుమారుడు, నాటి కేంద్ర మంత్రి కే.సి, పంత్ తో స్వయంగా శంకుస్థాపన చేయించారు. కానీ, ఏదో కారణాల వల్ల అది నిలిచిపోయింది. ఆ తర్వాత ధ్వని అనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ పేరున ఇక్కడ నెలకొల్పిన ఓపెన్ ఆడిటోరియం ప్రస్తుతం నగర వాసులకు ఏకైక సాంస్కృతిక వేదికగా కొనసాగుతోంది.

            గార్డెన్ కు నలువైపులా రోడ్ల విస్తరణతో పాటు, నగర ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్, సులభ్ కాంప్లెక్స్ లాంటి నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. త్రి పట్టన త్రయంగా పిలిచే వరంగల్ నగరంలో వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, కార్మిక, స్వచ్ఛంద సంస్థల ఉద్యమాల కేంద్రంగా ఈ పబ్లిక్ గార్డెన్ ఇప్పుడు అందరికి కేంద్ర బిందువుగా మారింది.

                             *కన్నెకంటి వెంకట రమణ, సంయుక్త సంచాలకులు, 9490396828 *

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు