రాజుకు కమలం కండువా!?



అశోక్ గజపతి రాజు బిజెపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమేనా..అందుకు ముహూర్తం ఖరారైందా..ఆయన కమలం పార్టీలో చేరితే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు గవర్నర్ పదవి నజరానాగా ఇవ్వబోతున్నారా..
        ఇలాంటి వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నా ఇప్పుడవి నిజమయ్యే రోజు దగ్గరికి వచ్చినట్టేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.నిజానికి 2019 ఎన్నికలకి ముందు అప్పటికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం
కమలంతో తెగదెంపులు చేసుకున్న సమయంలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా అశోక్ తో మాట్లాడి తమ పార్టీలోకి వచ్చేయాలని కోరినట్టు వార్తలు ఉన్నాయి.అశోక్ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అప్పటికి ఆయన నిర్వహిస్తున్న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పదవిలో ఆయన కొనసాగవచ్చునని..ఆయన కావాలంటే ఇంకేదైనా శాఖను ఇవ్వగలమని కూడా చెప్పినట్టు వినికిడి.అయితే అప్పుడు అది జరగలేదు.2019 ఎన్నికలలో అశోక్ విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మోడీ ఆయనతో మాటాడి బిజెపిలోకి ఆహ్వానించి గవర్నర్ పదవి ఇస్తామని చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి.అయితే అశోక్ అప్పుడు కూడా సానుకూల నిర్ణయం తీసుకోలేదు.ఇప్పుడు ఆ వార్తలకు మళ్లీ కదలిక వచ్చింది.
        బిజెపి..టిడిపి మైత్రి చెడిపోయిన తర్వాత సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖ నాయకులు బిజెపి..కేంద్ర ప్రభుత్వం..సాక్షాత్తు నరేంద్ర మోడీపై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడినా అశోక్ మాత్రం మోడీకి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అన్న దాఖలాలు లేవు.అలాగే నీతి నిజాయితీలకు మారుపేరుగా ఉండడమే గాక చాలా విషయాల్లో అవగాహనతో మాటాడే అశోక్ అంటే మోడీకి ప్రత్యేక అభిమానం.ఆ అభిమానంతో ఆమధ్య అశోక్ కు ఢిల్లీలో వెన్ను శస్త్రచికిత్స జరిగినప్పుడు మోడీనే ఏర్పాట్లు చేసినట్టు,అశోక్  ఢిల్లీలో ఉన్నంతకాలం ఆయన  బాగోగులు చూసే బాధ్యతను కేంద్ర మంత్రి ఒకరికి ప్రత్యేకంగా అప్పగించినట్టు వార్తలు ఉన్నాయి.మాన్సాస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై అశోక్ మోడీతో మాటాడినట్టు సమాచారం.ఆ సందర్భంలోనే మోడీ అశోక్ ను తమ పార్టీలోకి వచ్చెయ్యవలసిందిగా కోరినట్టు వార్తలు ఉన్నాయి.
         ఈ పరిణామాల నేపథ్యంలో అశోక్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు కూడా సమాచారం.ఆ పర్యటన సందర్భంలోనే ఆయన కమలం పార్టీలో చేరేందుకు అవసరమైన విధివిధానాలు
ఖరారైనట్టు భోగట్టా..ఇదంతా వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అవకాశం ఉందని అంటున్నారు.అదే జరిగితే ఆంధ్ర రాజకీయాల్లో..ముఖ్యంగా తెలుగుదేశం రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.ఇక విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు ఎటూ తప్పవు..
*కొసమెరుపు*
       తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో విజయనగరం జిల్లా రాజకీయాల్లో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు నాయుడు చాలావరకు పెత్తనం అప్పగించడం..గంటా ఈ జిల్లా రాజకీయాల్లో అవసరానికి.. తన పరిధికి మించి జోక్యం చేసుకోవడం అశోక్ గజపతికి అస్సలు మింగుపడని వ్యవహారంగా ఉండేది.ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది.అశోక్
తెలుగుదేశం పార్టీని నిజంగా వీడి వెళ్లే నిర్ణయం తీసుకుంటే ఈ పరిణామమే అందుకు ప్రధాన కారణం కావచ్చు..
       *ఇ.సురేష్ కుమార్* 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు