ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ - ఎన్నికల ప్రచారం వాయిదా


 అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయ‌న భార్య మిలానియా ట్రంప్‌ల‌కు క‌రోనా  పాజిటివ్ గా నిర్దారణ అయింది. దాంతో  క్వారెంటైన్ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు ట్రంప్ కాసేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.  త‌క్ష‌ణ‌మే రిక‌వ‌రీ ప్ర‌క్రియ‌ను కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  వైర‌స్ బారి నుంచి త్వ‌ర‌లోనే విముక్తి చెందుతామ‌ని కూడా ట్రంప్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 'ఈ రోజు రాత్రి మెలానియాతో పాటు నాకు కరోనా నిర్ధారణ అయింది. మేమిద్దరం క్వారంటైన్‌లో ఉండనున్నాం.. కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటాం' అని ట్రంప్ వివరించారు.

  ట్రంప్ స‌ల‌హాదారు హోప్ హిక్స్‌కు క‌రోనా సంక్ర‌మించింది. ఆమె పాజిటివ్‌గా తేల‌డంతో.. అధ్య‌క్ష సిబ్బంది మొత్తం అప్ర‌మ‌త్త‌మైంది.  ట్రంప్ దంప‌తులు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. 

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు ట్రంప్ క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్ తేల‌డం కొంత ఇబ్బందిక‌ర‌మే. ఎన్నిక‌ల తేదీ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ట్రంప్ ఎన్ని రోజుల పాటు క్వారెంటైన్ అవుతారో చెప్ప‌డం క‌ష్ట‌మే.  ప్ర‌త్య‌ర్థి జోసెఫ్ బైడెన్‌తో తొలి డిబేట్‌లో ట్రంప్ పాల్గొన్న విష‌యం తెలిసిందే.  ఈనెల 8వ తేదీన రెండ‌వ చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉన్న‌ది. కానీ ఈలోపే ట్రంప్ పాజిటివ్‌గా తేలారు. అయితే క్వారెంటైన్‌కు వెళ్ల‌నున్న ట్రంప్ ఎన్ని రోజులు స్వీయ‌నిర్బంధంలో ఉంటారో తెలియ‌దు.  పాజిటివ్‌గా తేలిన ట్రంప్‌కు ఎటువంటి వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నాయో కూడా ఇంకా నిర్ధార‌ణ కాలేదు. న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ట్రంప్ ప్ర‌చారానికి బ్రేక్ ప‌డిన‌ట్లు భావిస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు