గులాబి ఓనరుకు...సలాములుదివంగత నాయిని నరసింహా రెడ్డిది కుండ బద్దలు  కొట్టే మనస్తత్వం. భాద అయినా  సంతోషం అయినా   దాపరికం ఉండదు. కడుపులో ఉన్నది ఉన్నట్లు బయటికి కక్కేస్తారు. అదే ఆయనకు తెలంగాణ  స్వరాష్ట్రంలో అచ్చి రాలేదు. 2019 అసెంబ్లి ఎన్నికల్లో సిట్ట్ంగ్ హోం శాఖ మంత్రిగా ముషీరాబాద్ నియోజకవర్గం  టికెట్ ఆశించి లభించక అవమానాలు పడ్డాడు. తనకు ముషీరాబాద్ టికెట్ ఇస్తానని మాట ఇచ్చిన కెసిఆర్ మాట తప్పారని నాయిని భాద అక్కడి నుండే మొదలైంది. చివరికి తనకు ఇవ్వకుంటే పోనీ తన అల్లుడి కైనా టికెట్ ఇవ్వాలంటూ కెసిఆర్ ను కోరినా ఫలితం లేక పోయింది.  ముషీరాబాద్ లో ముఠా గోపాల్ కు టికెట్ ఇచ్చి ఆయన్ను గెలిపించుకు వస్తే మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన కెసిఆర్ మాట తప్పాడని నాయిని బహిరంగంగానే మీడియా ఎదుట భాదపడ్డారు. కెసిఆర్ మాట ఇచ్చినట్లు మంత్రి పదవి దక్కలేదు. చివరికి ఎమ్మెల్సి పదవి  అయినా ఇవ్వలేదు. 

టిఆర్ఎస్ లో తాను కూడ ఓనర్ నే నంటూ కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగి పోతారో తెలియదంటూ హోం మంత్రిగా ఉన్నపుడే నాయిని నరసింహా రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇాలాంటి వ్యాఖ్యలు సహజంగానే కెసిఆర్ కు నచ్చి ఉండవు. కెసిఆర్ కు ఇప్పుడు చెప్పే వారు కాదు. చెప్పింది నోరు మూసుకుని  వినే వారు కావాలి.  అందుకే నాయిని వంటి  వారిని పక్కన పెట్టారు. ఇప్పుడు ఎటువంటి వారు కెసిఆర్ చుట్టూ దడి కట్టారో అందరికితెల్సిన విషయమే.  మనసు విరిగి విరక్తితో పార్టీని వీడతారనే వార్తలు కూడ వచ్చాయి. అసంతృప్తితో ఉన్న నాయినికి ఏదో ఒక కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కెసిఆర్ ప్రయత్నాలు  చేసినా నాయిని ఆందుకు అంగీకరించ లేదు. హోం మంత్రిగా చేసిన నాకు కార్పోరేషన్ పదవి ఎందుకంటూ మనోవేదనతో  తిరస్కరించారు.

 సుదీర్ఘ కాలంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ కు కుడి భుజం, ఎడమ భుజం అంటూ అందరూ నాయినిని ఆకాశానికి ఎత్తారు. కాని ఆఖరికి ఆయనకు పార్టీలో  ఏ పాటి  గౌరవం దక్కిందో ఎంతగా ఆయన మానసికంగా భాద అనుభవించాడో అటు టిఆర్ఎస్ నేతలకు ఇటు తెలంగాణ ప్రజానీకానికి బాగా  తెల్సు. 


కెసిఆర్ ను పూర్తిగా నమ్ముకుని టిఆర్ఎస్ పార్టీ కోసం నాయిని నరసింహా రెడ్డి అన్ని మీదేసుకుని కెసిఆర్ మీద ఈగ వాలకుండా కాంగ్రేస్ పార్టీతో సహా ఇతర పార్టీల నేతలను చెడుగుడు ఆడాడు.  కేసిఆర్‌ను అడ్డగోలుగా తిడితే ఊరుకోమని ఓ సందర్భంలో కాంగ్రేస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని  హెచ్చరించారు. ఉత్తమ్‌ బట్టేబాజ్‌ అంటూ...కేసిఆర్‌ను జైల్లో పెడతానంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఎవరు కెసిఆర్ ను పల్లెత్తు మాట అన్నా భరించే వాడు కాదు. అట్లాంటి వ్యక్తి చివరికి కెసిఆర్ తనకు గౌరవ ప్రదమైన పదవి ఏది లేకుండా చేసిండని కనీసం అప్పాయింట్ మెంట్ కూడ లేదని తల్ల డిల్లి పోయాడు. తనను కలిసిన వారితో కెసిఆర్ బాగా మారి పోయాడని పాత కెసిఆర్ కాదని అంతా పవర్ బ్రోకర్ల తో పార్టి నడుస్తోందని తన మనసులో ఉన్న భాదను వెల్లగక్కిన సందర్బాలు చాలా ఉన్నాయి. అనారోగ్యంతో కరోనా సోకి ఆసుపత్రి పాలు అయ్యే వరకు నాయిని రందితో నే గడిపాడనేందుకు ఆయన సన్నిహితులే సాక్ష్యం.  


నాయిని నరసింహా రెడ్డి తెలంగాణ  ఉద్యమం ఆసాంతం ఉరుములై పిడుగులు కురిపించిన కల్లా కపటం ఎరుగని నిఖార్సైన ఉద్యమ కారుడు. రాజధాని నగరంలో అనేక కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా పనిచేసాడు. ఆయన రాజకీయ ప్రస్తానం కార్మిక సంఘాలతోనే మొదలైంది. 

తెలంగాణ ఉద్యమంలో అవిశ్రాంతంగా పోరాడిన యోదులు  అనేక మంది ఇప్పుడు నాయిని నరసింహా రెడ్డి లెక్కనే మానసిక వేదనలో గడుపుతున్నారు.

ఒకప్పుడు కెసిఆర్ పక్కనే కూర్చుని భుజం భుజం కలిపి ఉద్యమించిన వారు కనీసం పలకరింపులకు కూడ నోచుకో లేక పోతున్నారు. ఇాలాంటి నాయకుల కోసం కెసిఆర్ ఇంటి తలుపులు ఎప్పుడూ  తెరిచే ఉంచే వారనేది ఒకప్పటి మాట అయితే  ఇప్పుడు ఎప్పుడూ మూసే ఉంటున్నాయన్న ఆవేదన చాలా మందిలో ఉంది. తెలంగాణ ఉద్యమ కారులను ఉరికించి కొట్టిన వారు..తెలంగాణ వచ్చే వరకు ఆంధ్ర పార్టీలతో అంట కాగి ఆ తర్వాత పదవుల కోసం పవర్ బ్రోకర్లుగా  మారిన వారి హవా ఇప్పుడు ప్రగతి భవన్ చుట్టూ వీస్తున్నది.

ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకుండా.. పాడె మోసినా..కంట తడి పెట్టినా తెలంగాణ జనం మర్చిపోలేరు.

నాయిని నరసింహా రెడ్డికి నివాళు లతో
కూన మహేందర్ 
సీనియర్ జర్నలిస్ట్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు