కరోనా అంతం అయ్యే వరకు మాస్కులు తప్పని సరి - ప్రధాన మంత్రి నరేంద్ర మోది

 


కరోనా వైరస్‌ అంతమయ్యే వరకూ మనం మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని ప్రదాన మంత్రి నరేంద్ర మోది కోరారు. వాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్త అవసరమని కొద్దిపాటి నిర్లక్ష్యం తీవ్ర విశాదాన్ని తెస్తుందని హెచ్చరించారు. దేశం నుండి కరోనా పోలేదని దసరా, దీపావళి, క్రిస్ మస్, ఈద్, గురునానక్  పండగలు వస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని  అన్నారు.

కరోనా నేపద్యంలో ప్రధాని మంగళవారం సాయంత్రం దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని ప్రధాని పేర్కొన్నారు. రికవరీ రేటు బాగా మెరుగు పడిందని తెలిపారు. కరోనా మరణాల రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. వీటిలో కొన్ని కీలక దశలో ఉన్నాయని చెప్పారు.

‘ఇప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకొని కొవిడ్ మహమ్మారిపై విజయం సాధించాం. మన బాధ్యతలు నిర్వర్తించడానికి, నిత్య జీవిత కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి బయటకి వస్తున్నాం. ఈ సమయంలో ఒక్క విషయం అస్సలు మరచిపోవద్దు. వైరస్ వెళ్లిపోలేదనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు.

దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 5500 మందికి కరోనా సోకిందని మోదీ తెలిపారు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ప్రతి పది లక్షల జనాభాలో 25 వేల మంది వైరస్ బారిన పడ్డారని తెలిపారు. దేశంలో కరోనా నియంత్రణ చర్యలతో చాలా మంది ప్రాణాలు కాపాడటంతో సఫలమయ్యామని మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో 2 వేల పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. అతి త్వరలోనే కరోనా పరీక్షలు 10 కోట్లు దాటుతాయని చెప్పారు. ఈ పోరాటంలో ‘సేవా పరమో ధర్మ:’ మంత్రమే ప్రధానంగా భావించి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నిస్వార్థ సేవ చేస్తున్నారని కొనియాడారు.

‘మానవజాతిని కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో కృషిచేస్తున్నారు..వ్యాక్సిన్ కోసం మన శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నార’ని చెప్పారు.కరోనా వైరస్‌ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని  కోవిడ్‌-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా తేరుకుంటోందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచంతో పాటు భారత్‌ సైతం వేచిచూస్తోందని అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు