కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఇకలేరు



కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ (74) ఇకలేరు. పాశ్వాన్ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, లోక్ జనశక్తి (LJP) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్విటర్ ద్వారా తెలిపారు. ‘పప్పా ప్రస్తుతం మీరు ఈ ప్రపంచంలో లేరు. కానీ, మాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా నాతోనే ఉంటారు’ అంటూ చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. మిస్ యూ పప్పా అంటూ చిన్నతనంలో తనను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేశారు.
రాం విలాస్ పాశ్వాన్ 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో జన్మించారు. పాశ్వాన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1974లో లోక్‌దళ్ స్థాపించాక ఆ పార్టీలో చేరారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లాడు. 1977లో జైలు నుంచి విడుదలయ్యాక జనతా పార్టీలో చేరారు. 1977లో అత్యధిక మెజార్జీతో గెలిచి రికార్డు సృష్టించారు.

అనంతరం 2000లో లోక్‌జన్‌శక్తి పార్టీని స్థాపించారు. వి.పి.సింగ్‌, దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్‌, వాజపేయీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రివర్గంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1996 నుంచి 1998 వరకు రైల్వేశాఖ మంత్రిగా, 1999 నుంచి 2001 వరకు కమ్యూనికేషన్లశాఖ మంత్రిగా, 2004లో యూపీఏ హయాంలో ఉక్కు, ఎరువులు, రసాయనాలశాఖ మంత్రిగా పాశ్వాన్ సేవలందించారు.
 
మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు