ఏజెన్సీలో మెరిసిన వైద్య కుసుమాలు - ఊరిలో ఎనిమిది మంది డాక్టర్లు - ఒకే కుటుంబం నుండి ఐదుగురు

 అక్కా చెల్లెళ్లకు నీట్ రాంకులు
ఏజెన్సీలో మెరిసిన వైద్య కుసుమాలు
ఒకే కుటుంబంలో ఐదుగురు డాక్టర్లు
ఊరిలో ఎనిమిది మంది డాక్టర్లు

   మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) లో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకారాజపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెల్లు  ఆల్ ఇండియా రాంకులు సాధించారు. శంకారాజపల్లి గ్రామం సాయిని నర్సింహయ్య సుజాత దంపతుల కూతుళ్లు అక్కా చెల్లెల్లు గౌతమి, హరిప్రియలు శుక్రవారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా రాంకులు సాధించి ఏజెన్సీ  విద్యా కుసుమాలుగా మెరిసి  తల్లిదండ్రులకు, విధ్యా  బోధకులకు పేరు తెచ్చిపెట్టారు. 

   హరిప్రియ 581 మార్కులు సాధించి ఆల్ ఇండియా 29696 వ రాంక్ సాధించగా గౌతమి 545 మార్కులతో 52193 వ ర్యాంక్ సాధించింది. వీరు పొందిన ర్యాంకులకు రాష్ట్రంలోని ఉన్నత మెడికల్ కళాశాలలైన ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల్లో సీట్లు రావడమే కాకుండా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో కూడా సీట్లు వచ్చే అవకాశమున్నాయి. ఆరవ తరగతి వరకు మంగపేట మండలం కమలాపురంలోని రోజా మిష్టికా పాఠశాలలో చదివిన వీరు తర్వాత వరంగల్, హైద్రాబాద్ లో చదివి మంచి ర్యాంకులు సాధించారు. పలువురి ప్రశంసలను అందుకున్న చిన్నారులు బడుగు బలహీన వర్గాలకు, మా తల్లిదండ్రులకు జన్మనిచ్చిన ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందించడంలో ముందుంటామని అన్నారు.

   

ఒకే కుటుంబంలో ఐదుగురు డాక్టర్లు


సాయిని లక్ష్మీనర్సయ్య, లక్ష్మి  మనుమలు, మనుమరాళ్లయిన  ఐదుగురు ఒకే కుటుంబం నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించి విద్యను అందించడం ఆ కుటుంబంతో పాటు ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతానికి గర్వకారణం. సామాజిక ఉద్యకారుడు, మహాత్మ జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత సాయిని నరేందర్ కుమారుడు స్వప్నిల్ మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నాలుగవ సంవత్సరం చదువుతుండగా మహేష్ కుమారుడు స్నేహిల్, ప్రేమలత కుమార్తె అభిజ్ఞ గాంధీ మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యనభ్యసిస్తున్నారు. వీరి కుటుంబానికి సంబంధించి రామన్నగూడెం గ్రామానికి చెందిన అన్నదమ్ములైన ఇద్దరు డాక్టర్లు అల్లి నరేష్, నవీన్ లు ఇప్పటికే ఏజెన్సీ గ్రామాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీరుకాక  శంకరాజుపల్లి గ్రామంలో దేవులపల్లి లక్ష్మీనారాయణ కుమార్తె నమ్రత, దేవులపల్లి సత్యనారాయణ కూతుళ్ళయిన అక్కా చెల్లెల్లు తేజస్వి, సుచిత్ర ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. విద్యా సౌకర్యాలు అంతగా లేని  ఏజెన్సీ ప్రాంతంలో జన్మించి  డాక్టర్ విద్యనభ్యసిస్తున్న వీరికి పలువురు ఉపాద్యాలు, నాయకులు, సామాజిక వేత్తలు అభినందనలు తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు