మూడు చింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణిని ప్రారంభించిన సిఎం కేసీఆర్


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’పోర్టల్‌ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్  ప్రారంభించారు. 

'గ‌త పాల‌కులు రెవెన్యూ చ‌ట్టాలు, భూ విధానాల‌కు శ్రీకారం చుట్టారు. కొన్ని ఫ‌లితాలు ఇచ్చాయి. మరికొన్ని విక‌టించాయి. వాట‌న్నింటికీ శాశ్వ‌త నివార‌ణ కావాల‌ని, తెలంగాణ రైతాంగం ఎలాంటి అటుపోట్ల‌కు గురికావొద్ద‌నే ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ చ‌ట్టం కోసం నిర్ణ‌యం తీసుకున్నాం. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్‌ రూపకల్పన చేశాం ' అని కెసిఆర్ అన్నారు.

ఇకపై రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. డాక్యుమెంట్‌ రైటర్లను కూడా రాబోయే 10 రోజుల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎంత ఫీజు వసూలు చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుందన్నారు. కొత్త పాస్‌ పుస్తకం ఏడు రోజుల్లోనే ఇంటికి వస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్‌ జిల్లాలు మినహా) మండలాల్లో ఈ సేవలు రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు, 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు