ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 32 మంది మావోయిస్టులు

 


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు పార్టీ డొల్ల సిద్ధాంతాలతో విసిగి.. పోలీసులు ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు.

లొంగిపోయిన 32 మంది దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్‌, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్‌ గ్రూప్స్‌ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్పీ తెలిపారు. తాజాగా లొంగిపోయిన వారిలో పలువురికి గతంలో పోలీసులు, పోలింగ్‌ సిబ్బందిపై దాడికి పాల్పడిన నేపథ్యం ఉంది. నలుగురిపై తలో రూ.1లక్ష చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున అందించారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు

మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నవారు ప్రజా జీవనంలోకి రావాలని కోరుతూ స్థానిక పోలీసులు ‘లాన్‌ వర్రటు’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు నక్సల్‌ ప్రభావిత గ్రామాల్లో పెద్దఎత్తున పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు 150 మంది వరకు నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

హోంగార్డును కొట్టి చంపిన మావోయిస్టులు
 
 పోలీసులు ఓ వైపు కూంబింగ్ కొనసాగిస్తుండగ మరో వైపు మావోయిస్టుల  హోంగార్డును కొట్టి చంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నాయకులపు ఈశ్వర్ అనే హోంగార్డును కొట్టి చంపారు. బాధితుడు ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన వాడు. హోంగార్డు ఈశ్వర్‌ను చంపిన తర్వాత ఆ మృతదేహాన్ని చర్ల మండలం చెన్నపురం దగ్గరలోని గొత్తికోయ గ్రామం గోరుగొండ దగ్గర వదిలి వెళ్లారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు