ప్రజాహితంకై జీవితకాలం తపించి శ్రమించిన అరుదైన, అసలైన స్వామి "స్వామి అగ్నివేష్" - రామా సుందరి.

 
ప్రజాహితంకై జీవితకాలం తపించి శ్రమించిన అరుదైన, అసలైన స్వామి "స్వామి అగ్నివేష్"

- రామా సుందరి.

-------------------

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ లో మరణించారు. ఆయన వయసు 80. ఆయన కొద్దికాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం నుండి వెంటిలేటర్ మీద వుండి ఈ రోజు సాయంకాలం 6గంటలకు చివరి శ్వాస తీసుకొన్నారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో అగ్నివేశ్ జన్మించారు. ఛత్తీస్ ఘర్ లో తన తాతగారి దగ్గర పెరిగారు. న్యాయవిద్యను, కామర్స్ ను చదివి కలకత్తా సెయింట్ జేవియర్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. కొంతకాలం న్యాయవాద వృత్తిని కూడా చేశారు. 


1970లో ఆర్య సమాజ సూత్రాల ప్రకారం ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీతో పోటీ చేసి 1977లో హర్యానా అసెంబ్లీ నుండి గెలిశారు. 1979 వరకు హర్యానా విద్యాశాఖా మంత్రిగా ఉన్నారు. 


అప్పుడే ఆయన వెట్టిచాకిరీ విముక్తి సంస్థను స్థాపించారు. ఆ సంస్థ భారతదేశంలో, ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని గనుల్లో అమలులో ఉన్న వెట్టిచాకిరికి  వ్యతిరేకంగా పని చేసింది. వెట్టి చాకిరి మీద జరుగుతున్న నిరసన కార్యక్రమంపై కాల్పులు జరిపిన పోలీసుల మీద హర్యానా ప్రభుత్వం చర్య తీసుకోలేదని ఆగ్రహించి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు స్వామి అగ్నివేశ్. హర్యానా ప్రభుత్వం అతని మీద కక్ష కట్టి, ఒక హత్యానేరంలో ఇరికించి 14 నెలలు జైలుపాలు చేసింది. స్వామి అగ్నివేశ్ కు ఉన్న అభ్యుదయ భావాల వలన ఆయనను ఆర్యసమాజ్ నుండి 2008లో బహిష్కరించారు.  


సమకాలీన వెట్టిచాకిరీ రూపం గురించి స్వామి అగ్నివేశ్  జెనీవా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంస్థకు నివేదించారు. మహిళా విముక్తిని లక్ష్యంగా పెట్టుకొని పనిచేసి, 1987 సతి చట్టం రావటానికి కారకుడు అయ్యాడు. 2005లో భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దేశమంతా తిరిగాడు. అన్నిరకాల పాస్ పోర్ట్, వలస చట్టాలను మార్చాలని ‘ఆర్ధికాభివృద్ధి -మతం’ అనే ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో గొంతెత్తారు. 


‘ఐక్యరాజ్య సమితి నంబర్ ఒన్ ఉగ్రవాది అనటానికి నేనేమాత్రం సందేహించను. ఖురాన్ ను, ఇస్లాంను అప్రదిష్టపాలు చేయటం ఉగ్రవాదానికి ఉన్న అతిహీనమైన ముఖం. ఇస్లాం శాంతి కోసం, సహోదరత్వం కోసం నిలబడుతుంది. ముస్లిములు ఉగ్రవాదులు అనటం కంటే పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు’ అన్నారు. 


పర్యావరణ సమస్యల దగ్గర నుండి అభివృద్ధి పేరుతో భూములు కోల్పోయిన రైతులకోసం, అత్యంత అణచివేతకు గురి అవుతున్న ఆదివాసీల కోసం ఆయన  మాట్లాడారు. 


2011లో అన్నాహజారే మొదలు పెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, ఆ ఉద్యమానికున్న లొసుగులు గుర్తించి మధ్యలో విరమించుకొన్నారు. కశ్మీర్ లో మోహరించిన లక్షలాది సైన్యానికి వ్యతిరేకంగా ఆయన ప్రకటనలు చేశారు. 


మావోయిష్టులకీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగటానికి కృషి చేశారు. చర్చలకు అంగీకరించినట్లు నటించి ప్రభుత్వం మోసం చేసి, కామ్రేడ్ ఆజాద్ ను వల పన్ని చంపిందనీ, తెలిసో తెలియకో తాను కూడా ఆజాద్ మరణానికి కారకుడిని అయ్యానని ఆయన తరువాత బాధపడ్డారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తరువాత విభజిత తెలుగు రాష్ట్రాలలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు ఆయన హాజరు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాడ్డాక అమరావతిలో భూసమీకరణ పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ అఖిలభారత రైతు కూలిసంఘంతో బాటు అనేక సంఘాలు నిర్వహించిన నిరసనోద్యమంలో ఆయన పాల్గొని తన మద్దతు తెలిపారు. 


ఆయనకున్న మత వ్యతిరేక భావనల వలన హిందుత్వ సంస్థలు ఆయన మీద అనేకసార్లు దాడి చేశాయి. 2005లో పూరీ జగన్నాధ ఆలయాన్ని హిందువేతరల కోసం తెరవాలని ఆయన ప్రకటన చేయగానే ఆ గుడి పూజారులు ఆయన దిష్టిబొమ్మను తగలపెట్టారు. కశ్మీర్ అమర్ నాథ్ లో ఉన్న మంచుముక్కను శివుడు అని నమ్మించి యాత్రలు చేయించటాన్ని విమర్శించగా వందలాది హిందూ పూజారులు మళ్లీ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. స్వామి అగ్నివేశ్ ను చంపటానికి  అఖిల భారతీయ హిందూ మహాసభ 20 లక్షల బహుమానాన్ని ప్రకటించింది. అమరనాథ్ తీర్థయాత్ర విషయంలో హిందువుల సెంటిమెంట్లను గాయపరిచారని 2011లో సుప్రీం కోర్టు స్వామి అగ్నివేశ్ ను తప్పుపట్టింది.


2018 జులై 17న ఝార్ఖండ్ లో ఆయన మీద హిందూ మతోన్మాద మూక దాడిచేసి కింద పడేంత వరకు కొట్టింది. అతను క్రిష్టియన్ మిషినరీలకు సానుభూతి చూపిస్తున్నాడనీ, విదేశీ సంస్థల నుండి నిధులు తీసుకొంటున్నాడని తప్పుడు అభియోగాలు దాడికి పాల్పడిన వాళ్లు చేసారు. జరిగిన దాడిని సమర్ధించుకోవటానికి అప్పటి ఝార్ఖాండ్ బీజేపీ ముఖమంత్రి సిపి సింగ్ స్వామి అగ్నివేశ్ ను నకిలీ స్వామి అని ముద్ర వేశాడు. 


తరువాత నెలకు మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి అంత్యక్రియలకు హాజరవటానికి వస్తున్న స్వామి అగ్నివేశ్ మీద రెండో సారి దాడి చేసి తీవ్రంగా అవమానించ ప్రయత్నం చేశారు. 


స్వామి అగ్నివేశ్ బతికినంత కాలం ఆర్ ఎస్ ఎస్ కు కంటిలో నలకలాగా ఉన్నారు. కుల వివక్ష, మతోన్మాదాలకు వ్యతిరేకంగా ఆయన సామాజిక న్యాయం కోసం పాటుపడటం ఆర్ ఎస్ ఎస్ ఆధిపత్య భావజాలానికి ఆగ్రహం కలిగించింది.


కన్యాకుమారి దగ్గర నుండి కశ్మీర్ వరకు ఎక్కడ ప్రజలు న్యాయం కోసం పోరాడుతున్నారో అక్కడికి పరుగులు పెట్టారు స్వామి అగ్నివేశ్. ఫాసిష్టు రాజ్యాన్ని తల మోటించి ఎదుర్కొన్నారు. అణగారిన ప్రజల పట్ల ఆయన బాధ్యత వహించి జీవితకాలం పోరాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు