అనాధాశ్రమానికి వరంగల్ ఎన్ఆర్ ఐల ఆర్థిక సహాయం

తన ఇంటినే అనాధ ఆశ్రమంగా మార్చిన కోయ గిరిజన మహిళ
పోషణ లేని వయోవృద్ధులు, అనాధ పిల్లు, వికలాంగులను చేర దీసి ఆకలి తీరుస్తున్న మహిళ
జర్నలిస్ట్ చొరవతో స్పందించిన ఎన్ ఆర్ ఐలు





ఎజెన్సీ ఏరియాలో ఓ గిరిజన మహిళ నడుపుతున్న అనాధాశ్రమానికి లండన్ లో ఉంటున్న ఎన్ఆర్ఐలు ఆర్థికసహాయం అందచేసారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 150 కిలో మీటర్ల దూరంలో వెంకటాపురం మండలం లోని పాత్రపురం గ్రామంలో కారం రాధ అనే అదివాసి (కోయ) మహిళ 2017 నుండి తన ఇంటినే  అనాధాశ్రమంగా చేసి అనాధాల ఆకలి తీరుస్తోంది.  వెంకటాపురం మండలం పాత్రపురం మొదట్లో భూపాల్ పల్లి జయశంకర్ జిల్లాలో ఉండగా ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లాలో ఉంది.   ఆర్థిక వనరులు లేక పోయినప్పటికి దిన సరి కూలి పనులు చేసుకునే రాధ స్థానిక దాతలు ఇచ్చే సహాయంతో  వృద్ధులు, అనాధపిల్లలు, వికలాంగుల పోషణ భాద్యతలు తీసుకుంది. పట్టణాలు, నగరాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చూస్తుంటాం కాని  ఎక్కడో ఏజన్సీలో మారుమూలన ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మామూలు విషయం కాదు. అందులో ఓ ఆదివాసి మహిళ ఇందుకు పూను కోవడం విశేషం. 

అతి కష్టంతో దాతల సహాయంతో అశ్రమాన్ని నెట్టుకు వస్తోంది. కరోనా లాక్ డౌన్ నుండి ఆశ్రమం నడిపేందుకు చాలా కష్టపడుతోంది. వృద్ధులను, అనాధలను, వికలాంగులను పస్తులు ఉంచలేక ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించి వారి ఆకలి తీరుస్తోంది. ఆశ్రమం నిర్వాహకురాలు  కారం రాధ తాను నిర్వహిస్తున్న ఆశ్రమం పరిస్థితులు వివరిస్తు  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. వరంగల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కూన మహేందర్ ఆ పోస్ట్ కు స్పందించి వరంగల్ కు చెందిన  లండన్ లో ఉండే ఎన్ఆర్ ఐల ఫోరం ప్రెసిడెంట్ శ్రీధర్ నీల దృష్టికి తీసుకు వెళ్లారు. వరంగల్ ఎన్ఆర్ ఐల ఫోరం లండన్,యుకే సభ్యుల బృందం వరంగల్ ఉమ్మడి జిల్లాలో  అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచింది. 

ఎన్ ఆర్ఐల ఫోరం ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, వైస్ ప్రెసిడెంట్ లు జయంత్ వద్దిరాజు, వంశి మునిగంటి, రమణ సాదినేని జనరల్ సెక్రెటరి భాస్కర్ పిట్టల, జాయింట్ సెక్రెటరి ధీరజ్ తోట, మాడిశెట్టి భాస్కర్, భాస్కర్ నీల తదితరులు అనాధాశ్రమానికి రూ25000 సహాయం అంద చేశారు. గ్రేస్ హోం అక్కౌంట్ కు ఆన్లైన్ ద్వారా నిధులు బదిలి చేసారు. గురువారం (17-09-20120) గ్రామస్తులు, మీడియా వారి సమక్షంలో గ్రేస్ హోం ఆశ్రమ నిర్వాహకురాలు కారం రాధ ఎన్ఆర్ ఐలు చేసిన  సహాయాన్ని వెల్లడించారు. ఆశ్రమం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో సహాయం అంద చేయలేదని కారం రాధ తెలిపారు. లండన్ లో ఉండే వరంగల్ ఎన్ ఆర్ ఐ లందరికి ఆమె పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసారు. దాతల ప్రోత్సాహంతో మరి కొంతమంది  అనాధలను గుర్తించి ఆదుకుంటానని చెప్పారు. ఆశ్రమానికి స్వంతంగా భవనం నిర్మించే పనులు  నిధులు లేక పునాదుల స్థాయిలోనే నిలిచి పోయాయని తెలిపారు. ప్రభుత్వం అర ఎకరం  స్థలం ఇచ్చిందని అయితే నిధులు సమ కూరక పనులు అర్దాంతరంగా నిలిచి పోయాయని ఆమె వివరించారు. దాతలు ముందుకు వస్తే ఆశ్రమం భవనం పూర్తి చేయాలని ఉందని కారం రాధ తెలిపారు. ఆశ్రమానికి సహాయం చేసే దాతలు 8499019067 ఫోన్లో సంప్రదించాలని కారం రాధ విజ్ఞప్తి చేసారు.

ఏజెన్సీ ప్రాంతంలో ఓ గిరిజన మహిళ అయిన కారం రాధ అనాధలను చేర దీసి ఆశ్రయం కల్పించి వారి క్షుద్భాదలు తీర్చడం గొప్ప విషయమని వరంగల్ ఎన్ఆర్ఐ లండన్ యుకే ఫోరం అధ్యక్షులు శ్రీధర్ నీల అన్నారు. ఆమె సేవా స్పూర్తిని మనస్పూర్తిగా అభినందిస్తున్నామని ఇంకా ముందు ముందు వరంగల్  ఎన్ఆర్ ఐ ల ఫోరం లండన్,యుకే  తరపున పూర్తి సహాయ సహకారాలు అందచేస్తామని శ్రీధర్ నీల హామి ఇచ్చారు.

గ్రామ సర్పంచ్  బొగ్గుల కృష్ణార్జున రావు, వెటర్నరి సీనియర్ అసిస్టెంట్ పి నాగ లక్ష్మి, పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారయ్య, వైద్యులు దామినేని రాజేంద్ర ప్రసాద్, మాజి జెడ్పి టిసి వంక రాములు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు