నాగులు ఆహుతి దేనికి సంకేతం ?

 నాగులు ఆహుతి దేనికి సంకేతం ?
 తెలంగాణ బతుకులు కల్లోలంగా  మారుతున్నాయా ?



 తెలంగాణ ఉద్యమంలో మధ్యతరగతి, పేదవర్గాల ప్రజల  భాగస్వామ్యం  ఎక్కువ. సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఉద్యమంలో తమ జీవితాలను తాకట్టు పెట్టి చివరి వరకు నిలిచింది ఈ వర్గాల వారే.
తెలంగాణ రాష్ర్టం వచ్చిన తర్వాత ఎక్కువగా భాదపడుతున్నది కూడ ఈ వర్గాల వారే. తెలంగాణ వస్తే తమ బతుకులు ఇట్లా ఉండబోవని ఆకలి దప్పులు తీరుతాయని తమ పరిస్థితి ఎట్లా ఉన్నా తమ పిల్లలకు ఉద్యోగాలు  లభిస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబాలు తెలంగాణ రాష్ర్టంలో ఆగంలో పడ్డాయి. ఇందుకు తాజా ఉదాహరణే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగులు ఆత్మాహుతి. ఆరేండ్లు తెలంగాణలో ఏదో జరుగుతుందని ఎదురు చూసి బతికే మార్గం లేక పిల్లల భవిష్యత్  అంధకారంగా కనిపించి ఆసెంబ్లీ సమీపంలో సెప్టెంబర్ 10 వ తేదీన ఓ వైపు అసెంబ్లి సమావేశం జరుగుతుంటే  ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంటల్లో ఆహుతయ్యాడు. మంటల్లో శరీరం కాలుతుంటే జై తెలంగాణ అటూ కెసిఆర్ ఆదుకోవాలంటూ  నినాదాలు చేశాడు. పోలీసులు మంట లార్పినా అప్పటికే శరీరం 62 శాతం కాలి పోయింది. ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినా ఫలితం లేక నాగులు ఆ తెల్లవారే మరణించాడు. నాగులుకు భార్య డిగ్రీ చదువుతున్న  ఇద్దరు పిల్లలు (కుమారుడు,కూతురు) ఉన్నారు. బండ్ల గూడలో రాజీవ్ స్వగృహలో ఉంటూ బంజరా హిల్స్ లో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ ఉద్యోగం చేసిన నాగులు కరోనా కష్టకాలంలో మరిన్న ఇబ్బందులు ఎదురు కావడంతో సర్కార్ వైపు ఆశగా చూసి విసిగి పోయి చివరికి తనకు తాను ఆహుతయ్యాడు.

ఇట్లాంటివి సరైన పరిష్కారం కానే కాదు. కాని సమస్య తీవ్రతను ఆఖరి నిమిశాల్లో పూర్తి అసహాతయను భరించే ఓపిక చచ్చి పోయి  పాలకుల కళ్లు తెరిపించేందుకు  ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. నాగులు ఆత్మహత్య  తెలంగాణ రాష్ర్టంలో  ప్రస్తుతం మధ్యతరగతి నిరుపేద వర్గాల అవస్థలకు నిలువు టద్దం. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలేవి ప్రస్తుతం అమలైన దాఖలాలులేవు. నది జలాలకు  అడ్డు కట్టలేసేందుకు సర్కార్ ఖజానా  అంతా ఊడ్చి పెట్టి కాంట్రాక్టర్ల దోసిళ్లు నింపారు. తెలంగాణ లో  సామాన్యుల జీవితాలు అల్ల కల్లోలంగా మారాయి. తండ్రులకు బతుకు దెరువులేదు. వారి పిల్లలకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ రాష్ర్టంలో మెజార్టి ప్రజలు అసంతృప్తిలో యున్నారు. నివురు గప్పిన నిప్పులా ఉడికి పోతున్నారు. పాలకులు ప్రజల మనోభీష్టాన్ని గమనించకుండా ఏకపక్ష నిర్ణయాలతో సాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రజల ఫ్రస్టేషన్ ఒక్కసారిగా కట్టలు తెంచుకునే ప్రమాదం రాకముందే సర్కార్ కళ్లు తెరిస్తే మంచిది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు