హిమపాతంలో కూరుకు పోయి మరణించిన హవల్దార్ - ఎనిమిది నెలల అనంతరం బయట పడిన మృత దేహం

సరిహద్దులో పహారా కాసే సైనికుల కష్టాలు ఎట్లా ఉంటాయో తెలియ చేసే  యదార్థ గాధ ఇది.....

భారత సరిహద్దుల్లో మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతల్లో రక్తం గడ్డ కట్టే చలిలో పహారా కాసే సైనికుల  విధులు ఎంత కష్టంగా ఉంటాయో హవల్దార్ రాజేంద్ర సింగ్ ఉదంతం కళ్లకు కడుతుంది. ఎనిమిది నెలల కిందట హిమ పాతంలో కూరుకు పోయి మంచులో కప్పబడిన హవల్దార్ రాజేంద్ర సింగ్ మృత దేహాన్ని సైనికులు వెదికి కనుగొన్నారు.

 గల్లంతైన ఓ జవాను ఇన్నాళ్ల తర్వాత నియంత్రణ రేఖ వద్ద మంచు కింద విగత జీవుడై కనిపించాడు. కశ్మీర్ గుల్మార్గ్ లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర సింగ్ నేగి అనే ఈ జవాను జనవరి 8 నుంచి ఆచూకీ లేకుండా పోయాడు.  రాజేంద్ర సింగ్ ఆచూకీ లేకపోవడంతో అతడు మృతి చెందినట్టు భార్యకు ఆర్మీ అధికారులు లేఖ రాశారు. అయితే తన భర్త మృతదేహాన్ని చూసేంతవరకు తాను అతడి మృతిని నిర్ధారించుకోలేనని ఆమె సమాచారం అందించారు. అంతే కాదు తన భర్త హిమ పాతం వల్ల సరిహద్దు ఆవల ఉన్న పాకిస్తాన్ వైపు జారి పోయు ఉంటాడని అతని ఆచూకి కనుక్కోవాలని దేశ  ప్రధాన మంత్రి నరేంద్ర మోది, రక్షణ మంత్రిని లేఖల ద్వారా వేడుకున్నారు. హవల్దార్ రాజేంద్ర సింగ్ కోసం సైన్యం పలు మార్లు గాలించినా ఫలితం లేకుండా పోయింది.

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం తనిఖీలు చేపడుతుంది. ఈ సందర్భంగా మంచు పొరల కింద  రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు.మంచులో ఉండడం వల్ల మృత దేహం చెడి పోలేదు.  పోస్టుమార్టం అనంతరం జవాను మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజేంద్ర సింగ్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని చమోలి గ్రామం. రాజేంద్రసింగ్ 2001లో సైన్యంలో చేరాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు