నిజాం పాలనా కాలంలో వరంగల్ కు అగ్రస్థానం - సుబాహ్ కేంద్రంగా వరంగల్-కన్నెకంటి వెంకటరమణ

వరంగల్ ను పాలించిన సుబేదారులు ఎవరు..? వారి ప్రత్యేకతలేమిటి ?

సాలార్ జంగ్ చేపట్టిన పునర్వ్యవస్తీకరణలో భాగంగా 1884 లో ప్రత్యేకంగా సుబాహ్ లను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏర్పాటయిన నాలుగు సుబాహ్ లలో వరంగల్ తో పాటు ఔరంగాబాద్, మెదక్, గుల్బర్గా లున్నాయి. వీటిలో మొత్తం  17 జిల్లాలున్నాయి.


         భారత దేశాన్నిపాలించిన మొఘల్ చక్రవర్తులు తమ విశాల సామ్రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం అనేక సుబాలుగా విభజించారు. ఆ విధంగా ఏర్పడిన దక్కన్ సుభా కు సుబేదారుగా అసఫ్ జా నియమించిన నాటినుండి అసఫ్-జా వంశం ఇక్కడ వేళ్లూనికుంది.  నిజాముల్ ముల్క్ నిజాం పాలనలో ప్రధాని సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన పునర్వ్యవస్తీకరణలో భాగంగా వరంగల్ సుబాహ్ 1884 లో ఏర్పాటయింది. దీనికి కొద్దిగా వెనకకు వెళితే వరంగల్ ప్రాంతాన్ని శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి నాయకులూ, బహుమనీలకు చెందిన కుతుబ్ షాహీలు, మొఘల్స్, అసప్ జాహీలు పాలించారు. మొఘలాయి పాలన క్షీణదశకు చేరుకోగానే అప్పటివరకు సుబేదారుగా వ్యవహరించిన అసఫ్-జా-నిజాముల్ ముల్క్ 1724 ప్రాంతంలో స్వతంత్రుడిగా ప్రకటించుకున్నారు. అసఫ్-జా ల పాలనలో మొదటగా పరగణాలు, సర్కారులు గా రాజ్యం ఉండేది.

సుబేదార్ వ్యవస్థకు శ్రీకారం

     ఆరవ నిజాం ప్రభుత్వంలో ప్రధాని గా ఉన్న సాలార్ జంగ్ అనేక పాలనా పరమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఈ మార్పుల్లో ఒకటి సుబేదార్ వ్యవస్థ ను ఏర్పాటుచేయడం. అంతకు ముందు నిజాం రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో కేవలం పన్ను వసూలు మినహా మరే పనులు ఏమీ జరిగేవికావు. ఈ  పన్నుల వసూలు కూడా దేశ్ ముఖ్ ల ద్వారానో, గుత్తేదారుల ద్వారానో గుత్తాకిచ్చి వసూలు చేసేవారు. కేవలం పన్ను వసూలు తప్ప మరే సంక్షేమ, అభివృద్ధి ని పట్టించుకునేవారు కాదు. ఈ అశాస్త్రీయ పరిస్థితులను మార్చిన ధీరుడు సార్ సాలార్ జంగ్. నిజామ్ రాష్ట్రాన్ని రెండు పెద్ద భాగాలుగా అంటే తెలంగాణ, మరాట్వాడా గా విభజింపబడ్డాయి. కర్ణాటకులు  పెద్ద సంఖ్యలోనే  ఉన్నప్పటికి  వారిని మరాట్వాడాలోనే చేర్చారు. సాలార్ జంగ్ చేపట్టిన పునర్వ్యవస్తీకరణలో భాగంగా 1884 లో ప్రత్యేకంగా సుబాహ్ లను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏర్పాటయిన నాలుగు సుబాహ్ లలో వరంగల్ తో పాటు ఔరంగాబాద్, మెదక్, గుల్బర్గా లున్నాయి. వీటిలో మొత్తం  17 జిల్లాలున్నాయి. ఔరంగాబాద్ సుబహ్ లో ఔరంగాబాద్, బీడ్, పర్బనీ, నాందేడ్ జిల్లాలు, గుల్బర్గా సుబా లో గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, రాయచూరు జిల్లాలు, మెదక్ సుబాహ్ లో మెదక్, బాగత్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలుండేవి. వరంగల్ సుబాహ్ పరిధిలో వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్,నిజామాబాద్ జిల్లాలుండగా, ఈ సుబా లో చేరనట్టి ఆత్రపుఁబల్డ  జిల్లా కూడా ఒకటి ఉంది. ఈ ఆత్రపుఁబల్డ జిల్లాలో అంబర్పేట, ఆసిఫ్ నగర్, మేడ్చల్, షాబాద్, ధారూర్, ఖడ్క, హుమ్నాబాద్ లుండేవి.

నాలుగు జిల్లాలు, 30 తాలూకాలతో వరంగల్ సుబా

    వరంగల్ సుబా పరిధిలో ఉన్ననాలుగుజిల్లాల పరిధిలో 30 తాలూకాలు ఉండేవి. 1905 లో ఏర్పడిన వరంగల్ సుబాహ్ పరిధిలో ఖమ్మం, మహబూబాబాద్, మధిర, పాఖాల, పాల్వంచ, ములుగు, వరంగల్, యల్లందు తాలూకాలుండేవి. నిజామ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లా అతిపెద్ద జిల్లాగా ఉండేది. జనగామ తాలూకా నల్లగొండ జిల్లాలో, పరకాల తాలూకా కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేవి. సరళతర పాలనకై రాజ్యాన్ని జిల్లాలుగా తాలూకాలుగా విభజించి పన్నుల వసూళ్లు, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు నెలవారీ జీతాలతో తాలూక్దారి, తహశీల్ వ్యవస్థను ఏర్పాటుచేశారు.  మున్సిఫ్ లను, జిల్లా జడ్జి లను, ప్రత్యేకంగా సర్కారీ ఖజానాతోపాటు నేటికీ అమలులో ఉన్న కరోడ్జిరి (కస్టమ్స్ ), స్తాంపు కచ్చేరి (రిజిస్ట్రేషన్స్), సెక్రటరీ శాఖ, రెవిన్యూ (మాల్గుజరీ) విద్య, వైద్య, జంగ్లాత్ (అటవీ) వైద్యం, టప్పా (పోస్టాఫీసు)  లాంటి అనేక ప్రభుత్వ శాఖలను సాలార్ జంగ్ ఏర్పాటుచేసారు.

వరంగల్ కు ఆహ్వానం పలికే సుబేదారి బంగ్లా

          వరంగల్ నగరంలో అడుగు పెట్టగానే ఏంతో హుందాగా ఇప్పటికీ చెక్కుచెదరని ప్రస్తుత కలెక్టర్ అధికార నివాసంగా ఉన్న నాటి సుబేదార్ బంగ్లా ప్రతీ ఒక్కరినీ ఆహ్వాన పలుకుతుంది. ప్రస్తుతం డీ.ఐ.జీ.నివాస కార్యాలయం ఉన్న బంగ్లా అప్పటి వరంగల్ జిల్లా తహసీల్దార్ నివాస భవనం. వరంగల్ నగరంలో అడుగు పెట్టగానే నిజామ్ పాలకులు నిర్మించిన కాజిపేట రైల్వే స్టేషన్ నుండి కలెక్టర్ బంగ్లా, ఆర్ట్స్ కళాశాల, డీ.ఐ.జీ బంగ్లా, డీ.ఈ.ఓ ఆఫీస్, అదాలత్, సహకార బ్యాంకు, నీటిపారుదల ఇంజనీరు కార్యాలయం, ఆర్అండ్ బీ కార్యాలయం, బాగ్- ఏ ఆమ్ (పబ్లిక్ గార్డెన్), మర్కజీ, వెటర్నరీ ఆఫీస్, వరంగల్ తహశీల్, వరంగల్ లోని కస్టమ్స్ ఆఫిస్, రైల్వే స్టేషన్, ఆజాం జాహి మిల్స్, మామునూరు విమానాశ్రయం ఇలా ఎన్నోనిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.

                                 వరంగల్ పాలిత సుబేదారులు ఎవరు....

      వరంగల్ సుబాహ్ ను పాలించించిన సుభేదారులు ఎవరు, వారి ప్రత్యేకతలు ఏమిటి, వరంగల్ నగరంతో పాటు సుబాహ్ కు వారు చేసిన ప్రత్యేక సేవలేమిటి తదితర అంశాలను రానున్న వ్యాసాలలో వివరిస్తాను. అయితే, ఇప్పటి వరకు వరంగల్ సుబేదారు ల గురించి ఏ చరిత్ర గ్రంధంలో వివరంగా లేదు. ఏ సంవత్సరం నుండి ఎప్పటి దాకా పనిచేసిన సుబేదారులు ఎవరు, వారి ఫోటోలు కూడా వివరాలు దొరకలేదు. హైదరాబాద్ లోని ఆర్కైవ్స్ కు అనేక మార్లు వెళ్లి కూడా చూసిన ఈ వివరాలు దొరకలేదు. ఇక, వరంగల్ లోని కాకతీయ విశ్వ విద్యాలయంలో ఉన్న ఆర్చైవ్స్ లో నిజామ్ ప్రభుత్వ హయాం లోని ఇంజనీరింగ్ పనులకు సంబందించిన ఫైళ్లు మాత్రమే ఉన్నాయి.  వరంగల్ సుబాహ్ వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థపై కేవలం వి. రామకృష్ణ రెడ్డి అనే పరిశోధకుడు మాత్రమే చేసిన పీ.హెచ్.డీ గ్రంధం మాత్రమే హైదరాబాద్ ఆర్చైవ్స్ లో ఉంది. అయితే దీనిలో కూడా వరంగల్ ను పరిపాలించిన సుబేదార్ లగురించిన వివరాలు ఏమాత్రం లేదు. పలు చరిత్ర గ్రంధాలు, వ్యాసాలు, పలువురు చరిత్రకారులను  కలసి సేకరించిన వరంగల్ సుబేదార్ లపై రానున్న వ్యాసాలలో తెలియ చేస్తాను.

 కన్నెకంటి వెంకటరమణ

 డిప్యూటీ డైరెక్టర్

సమాచార, పౌర సంబంధాల శాఖ

9849905900

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు