వరంగల్ ఇంతె జార్ గంజ్ పోలీస్ స్టేషన్ కు ఆ పేరు ఎట్లా వచ్చిందో తెల్సా -వరంగల్ మొట్ట మొదటి సుబేదార్ నవాబ్ ఎవరో తెల్సా?




సాలార్ జంగ్ నూతన పరిపాలనా విధానంలో రూపొందిన వరంగల్ సుబాహ్ కు క్రీ.శ.1884 (1294 ఫసలీ )లో మొదటి సుబేదార్ గా పనిచేసిన వారు నవాబ్ ముస్తాక్ హుస్సేన్ ఇంతిసార్ జంగ్ వికురుల్ ముల్క్  వికారుద్దౌలా ( Nawab Mushtaq Hussain Intisar Jung Viqarulmulk Viqaruddaula). ఇతని అసలు పేరు నవాబ్ వికార్ ఉల్ ముల్క్ కాంబో (Nawab -ul -mulk Kmboh). కాగా, ఇతన్ని నవాబ్ వికార్ ఉల్ ముల్క్ మౌల్వీ అనీ, ముస్తాక్ హుసేన్ జుబేరి అని కూడా పిలిచేవారు. అంతకు ముందుకితను హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వంలో లా సెక్రటరీ గా పనిచేశారు. వరంగల్ సుబేదార్ గా పనిచేస్తున్న కాలంలోనే అతన్ని నిజామ్ ప్రభుత్వం రెవిన్యూ కార్యదర్శిగా తీసుకుంది. నాటి ప్రధాన మంత్రి బషీరల్ దవులా కు పర్సనల్ కార్యదర్శిగా పనిచేస్తూనే ఉప ప్రధానిగా పదోన్నతి పొందాడు. నిజాం ప్రభుత్వం ఇతన్ని 'నవాబ్ ఇంతిసార్ జంగ్' బిరుదుతో గౌరవించింది. హైదరాబాద్ రాష్ట్రంలో 17 సంవత్సరాలు పనిచేశారు.
    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో 1841 మార్చ్ 24 న జన్మించిన ఇతను రూర్కెలాలో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నాడు. అల్ ఇండియా ముస్లీమ్ లీగ్ సంస్థ ఏర్పాటులో ఇతనిది ప్రధాన భూమిక. బ్రిటిష్ ఇండియాలోని ముస్లీములకు ఆధునిక విద్యకావాలని కోరుతూ ఆలీగడ్ ఉద్యమాన్ని నడిపాడు. దీని ఫలితమే మహమ్మదిన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ (1875 ) లో ఏర్పాటయింది. తదనంతరం అది ఆలీగడ్ ముస్లీమ్ యూనివర్సిటీ గా రూపాంతరం చెందింది. ముస్లీములకు ఈయన సేవలకు గుర్తింపుగా 1994 లో పాకిస్తాన్ పోస్టల్ సర్వీసు ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.
   వరంగల్ పాత పట్టణంలో మనం పిలుస్తున్న ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇతని కాలంలో ఏర్పాటు చేసినట్లు చెబుతారు. అప్పటినుండి ఈ ప్రాంతం ఇంతజార్ గంజ్ గా పిలువబడింది. దీన్ని ఆనుకొని ఉన్న బీట్ బజార్ ను ఇతని సలహతోనే అప్పటి అవ్వల్ తాలుక్ దార్ ఫార్మేజ్ జంగ్  అభివృద్ధి చేశారు. (మరో సుబేదార్ గురించి మరో సోపానం లో)

కన్నెకంటి వెంకట రమణ 
డిప్యూటీ డైరెక్టర్ 
సమాచార పౌర సంబంధాల శాఖ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు