తెలుగు భాషపై పారశీ ఉర్దూ భాషల ప్రభావం - దహగాం సాంబమూర్తి వరంగల్భాషింపబడేది భాష. భాష మానవ జీవవాహిని.అతడి ఆలోచనలను,అనుభవాలను ఎదుటి వారికి తేటతెల్లం చేయగల శక్తి గలది. మానవుడు సంఘజీవియే గాదు భాషా జీవి కూడా. సంఘం కాలానుగుణంగా మార్పులకు లోనవుతుంది. మానవుడు కూడ ఆ మార్పులకు లోనవుతాడు. ఈ మార్పులలో పాతవి పోయి కొత్తవి చేరతాయి. మరి కొన్ని పర్యాయాలు పాతవి మరుగునపడి కొత్తవి చలామణి అవుతాయి. కొన్ని సందర్బాల్లో పాతవాటితో బాటు కొత్త విషయాలు కూడ సమాజ వ్యవహారంలో కనబడతాయి. ఇందుకు భాష అతీతం కాదు. భాష కూడ నిత్య పరిణామ శీలి. భాష కాలానుగుణంగా ఎన్నో కొత్త ధ్వనులను, పదాలను, పద బంధాలను, జాతీయాలను, వాఖ్య నిర్మాణ శైలులను, రచనా ప్రక్రియలను తనలో చేర్చుకుని సృజనాకత్మకత నవనవోన్మేషం అవుతుంది. ఈ విధమైన మార్పులకు తెలుగు భాష కూడ లోబడింది. ఇలా మార్పులకు సులభంగా లోబడే తత్వం అజంత భాష అయిన తెలుగునకే ఎక్కువ. అందుకే అది సజీవ భాష కాగల్గింది. పరిమితమైనందున ఓ ప్రాంతం వారైన భాషా వ్యవహర్తలు మరో ప్రాంతానికి వెళ్ళి అచటి బాషా వ్యవహర్తలతో భావ వినిమయానికి ప్రయత్నించడం అంతగా జరిగేది కాదు. కాని సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలు మెరుగు పడుట వలన ప్రాంతాలనే గాక ప్రపంచమే ఒకటిగా గుర్తింపు పొందుతున్న రోజుల్లో ఒక భాషపై మరో భాషా ప్రభావం తప్పని సరిగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మన తెలుగు భాషపై పారశీక భాషా ప్రభావాన్ని కూడ గ్రహించాల్సి ఉంది.
పారశీకం ప్రష్యాదేశపు భాష. నేటి ఇరాన్ దేశం ప్రాచీన కాలంలో ప్రష్యాగా వ్యవహరించబడేది. ఈ దేశీయులు మన దేశంపై దండయాత్ర చేసిన కాలంలో కొందరు రాజోద్యోగులు, సైనికులు, యుద్ధాల తర్వాత మన దేశం లేనే స్థిరపడ్డారు. వారు క్రమంగా ఉత్తర భారతదేశం నుండి దక్షిణాదికి వచ్చి  తెలుగుదేశంలో కూడ స్థిరపడడం, ఇక్కడి ప్రజలతో మమేకమవడం జరిగింది. ఇంతేగాక తెలుగు ప్రాంతాన్ని ఏలిన ముస్లిం పాలకుల భాష ఉర్దూ కూడా పలు పారశీక పదాలను తనలో ఇముడ్చుకున్నందున తెలుగు భాషా వ్యవహర్తలకు పలు పారశీక పదాలు  ఈ నాటికీ తెలుగు వ్యవహారంలో ఉన్నాయి. వీటి గురించి కొంత తెల్సుకుందాం.
తరాజు అన్న పదం తెలుగులో కనబడుతున్న మొట్ట మొదటి పారశీక పదం అని విమర్శకుల అభిప్రాయం. ఈ పదం తిక్కన రాసిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలో త్రాసు అనురూపంలో కనబడుతుంది. తరాజు అన్న పదం  నేటికి గ్రామీణ ప్రాంతాల్లో తక్కెడ, త్రాసు అను అర్దాల్లో  ఉంది. అట్లే త్రాసు అను శబ్దం ఈ వూరు శిలా శాసనంలోనూ, అడిదం సురకవిదని చెప్పబడుతున్న చాటు పద్యంలో తరాజు అను పదం కనబడుతుంది. కవి సార్వ భౌముడు శ్రీనాధుడు సుల్తాన్’ అను పారశీక పదాన్ని సురత్రాణ అని మార్చి ప్రయోగించిన విధం పాఠకులకు తెలుసు. ఈ పదాలు ఆయన కాశీఖండం, భీమఖండంలో కనబడతాయి. ఇక కులాహ్ అనే పదం ఆఫ్ రంజ్ అనే పదం తెలుగు లోకుల్లా, అపరంజి’ శబ్దాలుగా  మారి  చలామణిలో ఉన్నట్లు తెలుగు సాహిత్యంలో అదారాలున్నాయి. అట్లే మస్ జిద్ అను పారశీక పదం కూడా మసీదు అను అర్దంలో జన వ్యవహారంలో కనబడుతుంది. ఇలా తెలుగు సాహిత్యంలో ప్రవేశించిన పారశీక పదాలు వాటి అర్దాలు, వాటిని పేర్కొన్న గ్రంధాలు కొన్నింటిని చూద్దాం.
ఫౌజు  - పౌజు, పౌజ్రు, పవుజు         సైన్యం, దండు, గుంపు         -జైమిని భారం
                                                                              ప్రబోధ చంద్రోదయం  
షాల్    -శాలువ                        ఊలుతో చేసిన వస్ర్త విశేషం    -నవనాధ చరిత్రము
నఖీబ్    -నకీబు     -బిరుదులు చదువువారు(వందిమాగదులు) -  వరాహపురాణం
జేబ్      -జేబు       pocket అను అర్దంలో                            -సింహాసనద్వాత్రింశక
ఇక దార్ అనేది పారశీక భాషలో ఔక ప్రత్యయం. ఈ ప్రత్యయం హిందీ, ఉర్దూ పదాల చివర చేరుతుంది. మదద్ గారు, హవల్ దారు మున్నగునవి. ఇక తెలుగులో కూడ ఈ ప్రత్యయం చేర్చి అమ్మకం దారు, కొనుగోలుదారు అని ఉపయోగిస్తున్నారు.
ఇలా పలు పారశీక పదాలు తెలుగు భషలోకి వచ్చి చేరాయి.  అయితే ఈ పదాలు కొన్ని నేరుగా తెలుగులోకి వస్తే మరికొన్ని ఉర్దూ భాష ద్వారా తెలుగులో వచ్చి చేరాయి. (ఉర్దూ భాషలో అత్యధిక పదాలు అరబి – పారశీక భాషల నుండి వచ్చి చేరినవే) తెలుగులో
సంస్కృత పదాలు మమేకమైనట్లుగా పారశీక పదాలు కూడ పదాలుగా, పదభందాలుగా, తెలుగు ప్రత్యయాలు కలిసిన పదాలుగా వ్యవహారంలో ఉండి తెలుగు భాష వ్యవహర్తల భాషా సంపదను సుసంపన్నం చేస్తున్నాయి.
(ఈ వ్యాస రచనకు కె.గోపాల కృష్ణారావు రాసిన తెలుగు ఉర్దూ పారశీకముల ప్రాభావం  ఆధారం వారికి కృతజ్ఞలతో)
తెలుగు భాషపై ఉర్దూ భాషా ప్రభావం        
ఏ భాషలోనైనా పదాలు దేశ్యాలు, అన్యదేశ్యాలు, అని రెండు రకాలుగా ఉంటాయి. దేశ్యాలు అంటే
ఏ భాషలోనైనా పదాలు దేశ్యాలు, అన్యదేశ్యాలు, అని రెండు రకాలుగా ఉంటాయి. దేశ్యాలు అంటే ఆ భాషకు   మూల బాషనుండి సంక్రమించినవి. ఇతర భాషల నుండి వచ్చి చేరినవి అన్యదేశ్యాలు. ఇలా ఓ భాష నుండి మరో భాషలోకి   పదాలు రావడాన్ని ఆదానం అంటారు.సాధారణంగా భాషను మాట్లాడే వారు వారి పరిసరాల్లోని భాషల నుండి తమ భాషలో లేని పదాలను గ్రహించి నిత్యం  ఉపయోగిస్తుంటారు. ఇందుకు సాంఘీక కారణాలుండవచ్చు. మతపరైన కారణాలుండవచ్చు. రాజకీయ కారణాలుంజవచ్చు. భాషా వ్యవహర్తలు తమ భాషలో ఏదేని ఒక వస్తువును గాని భావాన్ని గాని వ్యక్తం చేయాలనుకున్నపుడు దానికి తగిన పదం దగ్గరలోని భాషలో ఉంటే దాన్ని స్వీకరించడం సహజంగానే జరుగుతుంది.
పరిపాలనా వ్యవస్థలోని పదజాలం పాలితుల భాషలోకి వచ్చి చేరడం పాలితుల భాషలోని కొంత పదజాలం పాలకుల భాషలోకి వెళ్ళడం సాధారణంగా జరిగేదే. ఇలాంటి పదాలను బట్టి ఆయా బాషా వ్యవహర్తల మధ్యగల సంబంధాలు మున్నగు వానిన చారిత్రకులూహిస్తారు.
మనదేశంలో 13వ శతాబ్దంలో మహ్మదీయుల దండయాత్రలు ప్రారభమయ్యాయి. ఆనాటి నుండి పాశ్చాత్య దేశాల నుండి వలస వచ్చిన రాజులు, రాజోద్యోగులు, సైనికులు ఆయా భాషలను మాట్లాడటం వల్ల స్థానిక భాషలోని పదాలు వారి భాషల్లోకి, వారి భాషల్లోని పదాలు స్థానిక భాషల్లోకి వచ్చి చేరాయి.
ప్రధానంగా దక్షిణ భారతదేశంపై  మహ్మదీయులు జరిపిన దండయాత్రలు,తత్ఫలితంగా రాజ్యస్థాపనలు మున్నగు కారణాల వల్ల ద్రావిడ బాషయైన తెలుగులో కూడా వారి బాషయైన ఉర్దూ పదాలు పుష్కలంగా చేరిపోయాయి. ఈ పదాలు ఏరకంగా తెలుగు పదాలుగానే ఒదిగి పోయి స్థానీయతా లక్షణాన్ని సొంతం చేసుకున్నాయి.
             అంతకు ముందు నుండే అంటే తిక్కన తిక్కన కాలం నుండే ఉర్దూ పదాలకు మూల భాషలైన పారశీకం అరబ్బీ భాషల పదాలు మన తెలుగు సాహిత్యంలో మనకు గోచరిస్తాయి. అయితే ఉర్దూ భాష పదాలు తెలుగు భాషలో చేరినపుడు అవి తమ సొంత నిర్మాణాన్ని కొంత వదులుకొని, తెలుగుభాషా నిర్మాణానికి అనువుగా ఒదిగి పోయాయి. ఇలా చేరిన పలు పదాలు తెలుగు వారిన నోళ్ళలో నిత్యం నానుతూనే ఉన్నాయి. వీటిని పరిశీలిద్దాం.
ఉర్దూ                        తెలుగు                       అర్దం
పహ్రా                      పహారా                     కావలి
దర్యప్త్                     దర్యాప్తు                   పరిశోధన
ఫిరానా                    ఫిరాయించు             తిప్పు, మారు
షికార్                      షికారు                      వాహ్యాళి
ఖాతా                      కాతా                      లెక్కపుస్తకం
కిస్త్                         కిస్తీ                        వాయదా,పన్ను
ఉర్దూ భాషా ప్రభావం ఎక్కువగా కనిపించే తెలంగాణా ప్రాంతంలోని తెలుగులో వాక్య నిర్మాణంలో కూడా ఒకింత మార్పు కనిపిస్తుంది.  ఉదాహరణకు నేను బయటకు పోయిన(మైబాహర్ గయా), మదద్ గార్ రాలేదు. (మద్దత్ గార్ నై ఆయా) వత్తాసు ఇచ్చే వ్యక్తి రాలేదనే అర్దంలో వాడుకలో ఉంది.
ఉర్దూలోని నమ్మక్ హరామ్ అనే పదం ఉప్పుతిన్నఇంటికే ద్రోహం చేయడం య్ను భావంతో ఒక జాతీయంగా స్థిరపడింది. తెలుగులో నమక్ అనే పదం లేదు. ఉర్దూలో క్రియా రూపాలుగా
చలామణిలో ఉన్నాయి. ఉదాహరణకు బనాయించు, చలాయించు, దౌడాయించు, మిలాయించు మున్నగునవి.
ఇక ఉర్దూలో మ, న అనే రెండు అనునాసికాలే ఉన్నాయి. చిమ్టా, చమ్టా, చమ్కీ లాంటి ఉర్దూ పదాలు తెలుగులోకి వచ్చేసరికి చిమటా, చమడా, చమికీగా మారాయి. ఇక ఉర్దూలోని ఖరీద్ తెలుగులో ఆఖరుగా మార్పు చెంది వాడుకలో ఉన్నాయి.మనం తెలుగువారు భుజంపై వేసుకునే కండువా కూడ ఉర్దూ పదం ఖండియాకు రూపాంతరమే. ఇలా ఓ బాష మరో భాషనుండి పదాలను యెరువు తెచ్చుకొన్నప్పుడు స్వభాషలోని పద నిర్మాణానికి అనుకూలమైన విధంగా మార్చి వాడుకలో పెడుతుంది.
          ఇక తెలుగు సాహిత్యంలో కూడ ఉర్దూ పదాలు చేరిపోయాయి. తెలుగు ప్రాంతం ప్రధానంగా మహ్మదీయుల పరిపాలనలోకి వచ్చిన తర్వాత వెలువడిన రచనల్లో ఉర్దూ పదాలు అధికంగా కనిపిస్తాయి. దివాన్ ఖానా, ఖజానా, దరఖాస్తు, బందోబస్తు, షరాబు, నవాబు,తురాయి – లడాయి, తక్రారు, జరూరు, మున్నగు పదాలు తెలుగు సాహిత్యంలో కనబడతాయి. గురజాడ రాసిన ముత్యాల సరాల్లో ఉర్దూ గజళ్ళ ప్రతిబింబాలున్నాయి. కాళోజీ నా గొడవ  లో అనుసరించిన పాదాంత ప్రాస ఉర్దూ ప్రభావంతోడిదే అని విమర్శకుల అభిప్రాయం. దాశరథి గాలిబ్ గీతాలు, కవితా పుష్పకం ఉర్దూ ప్రభావంతో తెలుగులోకి వచ్చినవే. ఇక కథలు,కథానికలు,నవలలు,నాటకాలు,లేఖలు,జీవిత చరిత్రలు, యాత్రా చరిత్రలు ఒకటేమిటి తెలంగాణా ప్రాంతంలో వెలిసిన పలు ప్రక్రియల్లో ఉర్దూ పదాలు, ఉర్దూ పదాలతో కూడిన వాక్య నిర్మాణాల మనకు కనబడతాయి. ఇలా ఉర్దూ భాష తెలుగు భాషపై, తెలుగు సాహిత్యంపై  చెరగని ముద్ర వేసింది. పలు ఉర్దూ పదాలు తెలుగు వారికి సొంతమై తెలుగు పదాలుగానే వ్యవహారంలో ఉన్నాయనుటలో అతిశయోక్తి లేదు.

(దహగాం సాంబమూర్తి, వరంగల్ వారి రచన తెలుగు భాష సాహిత్యం దర్పణం నుండి)            

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు