నిజాం కాలంలో వరంగల్ సుబేదారులుగా పని చేసిన ఆ ఎనిమిదిమంది వీరే


 పార్ట్ 2
 నిజాం రాజ్యంలో కొంత భూభాగాన్ని నిర్దారింఛి ఆ ప్రాంతంలో పన్నులసేకరణను గుత్తేదారులకు అప్పగించేవారు. వారిని తాలూకాదార్లు, దేశముఖ్ లు, దేశ్ పాండేలని పిలిచేవారు. భూమి స్వభావాన్ని బట్టి పన్నులను నిర్దారించేవారు. చెల్క,తరి,నల్లరేగడి, ఎర్రరేగడి, బావుల కింద, కాలువల కింద అలా భూములను నిర్థారించి పన్నులను వసూలు చేసేవారు. కాలం అయినా, కాకున్నా పన్నులు మాత్రం కచ్చితంగా వసూలు చేసేవారు.  దీనితో గ్రామీణ రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ అశాస్త్రీయ పన్నుల విధానాన్ని మార్చి సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు బ్రిటిష్ రెసిడెంట్ లుగా ఉన్న రస్సెల్, మెట్ కాల్ఫ్ లు ప్రయత్నించినప్పటికీ బలంగా ఉన్న దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు పడనివ్వలేదు. నిజామ్ ప్రధానిగా ఉన్న సాలార్ జంగ్-1  హయాంలో 1853 లో పరిపాలన వ్యవస్థలో భారీ ఎత్తున మార్పులు తెచ్చారు. తాలూకుదార్లను వేతనం పై పనిచేసే విధంగా నియమించారు. 1864 లో రెవిన్యూ బోర్డు ను ఏర్పాటుచేసి నిజాం దివాణాన్ని 14 జిల్లాలు, 74 తాలూకాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు ఒక తాలూక్దార్ ను ఇంఛార్జిగా,  ఆయనకు సహాయకులుగా అసిస్టెంట్ తాలూకాదార్లను నియమించి వారికి జ్యుడిషియల్ అధికారాలను కల్పించారు. వీరిపై పర్యవేక్షకులుగా సుబేదారులను నియమించారు. ఎన్నో ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసి పాలన ఫలాలను సామాన్యుడికి అందేలా చర్యలు చేపట్టారు. అందుకే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అన్నట్టుగా సాలార్ జంగ్ ముందు, సాలార్ జంగ్ తర్వాత అని నిజాం పాలనా తీరును విశ్లేషిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ రూపకర్త సాలార్ జంగ్. ఈ మార్పుల్లో భాగమే సుబేదార్ వ్యవస్థ. అంతకుమందు సర్కారులుగా ఉన్న రాజ్యానంతా నాలుగు సుభాల కిందకు తీసుకువచ్చారు  వరంగల్,ఔరంగాబాద్,మెదక్, గుల్బర్గా లుగా సుబాహ్ లుగా ఏర్పాటు చేశారు. ఈ సుబాహ్ లన్నింటిలోనూ వరంగల్ సుబహ్ వైశాల్యంలో అతి పెద్దది. 20943 చదరపు మైళ్ళ విస్తీర్ణంలోఉన్న వరంగల్ సుబహ్ జనాభా 1911 లో 26,57,447 ఉండగా, 44 శాతం అటవీ  విస్తీర్ణం ఉండేది. ఈ సుబహ్ పాలకులుగా పాలనా రంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను సుబేదారులుగా నియమించారు.
 *వరంగల్ సుబేదారులుగా ఎనిమిది మంది*
  సర్ సాలార్ జంగ్ నూతన పాలనా విధానంలో రూపొందిన వరంగల్ సుబా కు 1294 ఫసిలి అనగా 1884 లో మొట్టమొదటి సుబేదార్ గా నవాబ్ ఇంతిసార్ జంగ్ ను నిజాం ప్రభుత్వం నియమించింది. ఇతని పేరుపైనే ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటయింది. ఆ ప్రాంతాన్నంతా ఇంతిసార్ గంజ్ అని కూడా పిలుస్తున్నారు. ఇలా మొదటి సుబేదార్ గా పనిచేసిన ఇంతిసార్ జంగ్ అనంతరం 1948 సంవత్సరం వరకు మొత్తం ఎనిమిది మంది సుబేదారులు గా పనిచేశారు.
వరంగల్ సుబేదారులు వీరే
1 . నవాబ్ ముస్తాక్ హుస్సేన్ ఇంతిసార్ జంగ్ వికురుల్ ముల్క్  వికారుద్దౌలా ( Nawab Mushtaq Hussain Intisar Jung Viqarulmulk Viqaruddaula )
2 .అహ్మద్ నవాజ్ జంగ్ బహద్దూర్, నవాబ్  (Ahmad Nawaz Jang Bahadur , Nawab ).
3 . రాజా మురళీధర్ ఫతే నవాజ్వంత్ బహద్దూర్.(Raja Muralidhar Fateh Nawazvant Bahadur)
4 . సయ్యద్ మొహియొద్దీన్ ఖాన్ మొహియొద్దీన్ యార్ జంగ్ @ హంటర్ సాబ్ (Syed
     Mohiuddin Khan yar Jung )
5 . అబిద్ నవాజ్ జంగ్ బహద్దూర్ నవాబ్ (ABID NAWAZ JANG BAHADUR NAWAB )
6 . అబ్దుల్ బాసిత్ ఖాన్, మహమ్మద్ (Abdul Basith Khan Mohammad )
7 . సుబేదార్ అమీర్ అలీ ఖాన్. ( Amir Ali khan )
8 . హబీబ్ మహ్మద్ (Habib Mohammad ).
            వరంగల్ సుబేదారులుగా పనిచేసిన పై వారిలో కొందరు బహుముఖ ప్రజ్ఞాశాలురుగా ఉండీ నిజాం ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోనూ పదవులు పొందారు. వీరిలో కొందరు వివాదాస్పదులుగా ఉన్నారు. ఈ సుబేదారుల ప్రత్యేకతలు, పనితీరు, వరంగల్ పై వారు వేసిన ప్రత్యేక ముద్రల గురించి వచ్చే సోపానాలలో తెలియచేస్తాను.. ( వీరి ఫొటోలకై ఏంతగానో ప్రయత్నించినప్పటికీ దొరకలేదు. ఎవరి వద్దనైనా ఉన్నా లేక ఎక్కడ దొరుకుతాయో చెపితే నేను కలెక్ట్ చేసుకుంటాను. ఉంటె ఈ వాట్స్ అప్ నెంబర్ కు పంపించండి. 9849905900

                       
                         కన్నెకంటి వెంకటరమణ


 డిప్యూటీ డైరెక్టర్, సమాచార,
 పౌర సంబంధాల శాఖ



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు