తిరుమల లో శ్రీవారి తొలి దర్శన భాగ్యం యాదవులకే ఎందుకు?

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం తొలి దర్శన భాగ్యం లభించే సన్నిధి గొల్లల మిరాశి వ్యవస్థను పునరుద్దరిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బిల్లు ఆమోదించడంతో  దేశ వ్యాప్తంగా యాదవ సమాజంలో హర్షాతి రేకాలు వ్యక్తం అయ్యాయి.

చాలాకాలంగా యాదవులు తిరుమల తిరుపతి దేవస్థానంలో తమ వంశ పారంపర్య హక్కు ఆయిన మిరాశి వ్యవస్థను పునరుద్ద రించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు.ఎన్నికల ప్రచారం సమయంలో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిధి గొల్ల మిరాశి వ్యవస్థ పునరుద్దరిస్తానంటూ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జూన్ 12 న జరిగిన మంత్రి వర్గం సమావేశంలో మిరాశి వ్యవస్థను పునరుద్దరిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. జూన్ 16 న జరిగిన శాసన సభ సమావేశాల్లో ఇందుకు సంభందించిన సవరణ బిల్లును ఆమోదించడంతో సన్నిధి గొల్ల మిరాశి వ్యవస్థ పునరుద్దరణకు పూర్తి చట్ట బద్దత కలిగింది.

అప్పట్లో ఎన్టీఆర్ రద్దు చేస్తే... వై.ఎస్. జగన్  పునరుద్దరించాడు

ఎన్టీరామారావు 1983 లో  ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక సంస్కరణలు అమలు చేసారు. శ్రీవారి పట్ల ఆపార భక్తి విశ్వాసాలు కలిగిన ఎన్టీరామారావు  తిరుమలను అనేక విధాలుగా అభివృద్ధి చేశారు.  కాని వంశ పారంపర్యంగా కొనసాగుతూ వచ్చిన, మిరాశి వ్యవస్థను రద్దు చేసారు. దాంతో ఆర్చకులు,సన్నిధి గొల్లలు వంశ పారంపర్య హక్కులు కోల్పోయి జీత భత్యాలతో ఉద్యోగులుగా మారాల్సి వచ్చింది. తిరిగి మిరాశి వ్యవస్థను పునరుద్దరించాలని కోర్టుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.  వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  అర్చకులకు 2006 లో వారసత్వ హక్కులు కల్పించారు. అర్చకులు 65 ఏళ్లకు పదవి విరమణ లేకుండా జవసత్వాలు ఉన్నంత వరకు అర్చకత్వంలో కొనసాగే అవకాశం ఏర్పడింది. కాని సన్నిధి గొల్లకు ఆ విదంగా హక్కులు కల్పించక పోవడంతో వారంతా తమ హక్కును పునరుద్దరించాలని చాలాకాలంగా కోరుతూ వచ్చారు.బిసి కులాల్లో సంఖ్యా పరంగా యాదవులు బలమైన మెజార్టి  కలిగినవారు కావడంతో ఎన్నికల సమయంలో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం మిరాశి వ్యవస్థను పునరుద్దరించి మాట నిల బెట్టుకోవడంతో యాదవులు కృతజ్ఞతలు తెలియ చేశారు.

సన్నిధి గొల్లకు అసలు శ్రీవారి ఆలయంలో అంత ప్రాధాన్యత ఏమిటి?

శ్రీవారి ఆలయంలో నిత్యం తొలి దర్శన భాగ్యం లభించేది సన్నిధి గొల్లకే. బ్రాహ్మి ముహూర్తంలో సన్నిధి గొల్ల ముందు దివిటి ధరించి ఆలయ తలుపులు తీస్తేకాని వెనక అర్చకుల సుప్రభాత పారాయణం మొదలు కాదు. ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ సుప్రభాతం.
తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన సన్నిధి గొల్ల దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకించి ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబురా పట్టుకుని మేలు కొలుపుతారు. బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధి గొల్ల దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. ఆయన వెనకాల అర్చకులు సుప్రభాత పారాయణం అరంభిస్తారు.


సన్నిధి గొల్ల పురాణానికి చాలా పెద్ద చరిత్రే ఉంది

శ్రీమన్నారాయణుడు లక్ష్మిదేవిని వెదుక్కుంటూ భూలోకం వచ్చిన పూర్వ కాలంలో సన్నిధి గొల్లే తొలుత స్వామిని దర్శించాడనేది పురాణాల్లో ఉన్న గాధ. శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణ ఘట్టంలో ఈ గాధ ఉంది. స్వామివారు లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి రాగా  ఆమెజాడ తెలియక పోవడంతో బాగా అలిసి పోయి ఓపుట్టలో స్వేద దీరుతాడు. ఆకలి దప్పులు లేక సొమ్మసిల్లి పోయిన స్వామివారి ఆకలిని తీర్చడానికి బ్రహ్మ,పరమేశ్వరులు ఆవు,దూడ రూపంలో వస్తారు. గొల్ల కాపరి వాటిని మేత కోసం అడవికి తీసుకువెళ్ళిన సమయంలో  సన్నిధి గొల్ల కళ్ళు కప్పి ఆవు పుట్టలో ఉన్న శ్రీవారికి  పాలు అంది స్తుంది. ఒక రోజు అది గమనించిన గొల్ల కాపరి పుట్టలోకి పాలు అందిస్తున్న ఆవును కర్రతో కొట్టగా ఆ దెబ్బ ఆవుకు తగలకుండా శ్రీవారిని గాయపరుస్తుంది. భూలోకంలో శ్రీవారిని మొదటగా చూసింది గొల్లే కాబట్టి సన్నిధి గొల్లగా పేరు స్థిర పడింది. కలియిగంలో శ్రీవేంకటేశ్వర స్వామిగా వెలుస్తానని తనను మొదలు చూసిన సన్నిధి గొల్లకే మొదటి దర్శన భాగ్యం ఉంటుందని, ఇది స్వామి వారు సన్నిధి గొల్లకు ఇచ్చిన  వరంగా పురాణాల్లో గాధ ప్రచారంలో ఉంది.
అందుకే సన్నిధి గొల్లకు వంశపారం పర్యంగా శ్రీవారి తొలి దర్శన భాగ్యం లభించింది. ఇది కొన్ని వందల, వేల సంవత్సరాల కాలం నుండి కొనసాగుతూ వస్తోంది.
 ఆ సంప్రదాయమే ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో కొనసాగుతోంది. అందులో భాగంగానే సన్నిధి గొల్ల కుటుంబానికి వంశ పారపర్యంగా ఈ అవకాశాన్ని కల్పించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు