సినీ న‌టి రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్ళు.. కారు డ్రైవర్ అరెస్ట్

తన ప్రమేయం లేదని చెప్పిన రమ్యకృష్ణ

కారులోకి ఎట్లా వచ్చాయో తెలియదన్న రమ్యకృష్ణ

కారు డ్రైవర్ పై కేసు నమోదు

చెన్నై: ప్ర‌ముఖ సినీ నటి భాహుబలి ఫేమ్ శివగామి రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లు దొరకడం చెన్నై లో కల కలం రేపింది. చెన్నైలోని ఈసీఆర్ రోడ్డు చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర‌ కనత్తూరు పోలీసులు ఆమె కారులో తనిఖీలు చేయ‌గా 96 బీరు బాటిళ్లు, 8 విస్కీ  బాటిళ్ళు బ‌య‌ట‌ప‌డ్డాయి.  పోలీసుల త‌నిఖీ సమయంలో రమ్యకృష్ణ, ఆమె సోదరి వినయ కృష్ణన్ కారులోనే ఉన్నారు. రమ్య కృష్ణను  పోలీసులు ప్రశ్నించి వదిలి వేశారు. కారులో లభించిన బాటిళ్లతో తనకు సంభందం లేదని రమ్య కృష్ణ పోలీసులకు చెప్పినట్లు తెల్సింది. తన ప్రమేయం లేకుండా బాటిళ్లు ఎట్లా వచ్చాయో కూడ తెలియదని చెప్పడంతో  కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కారు డ్రైవర్ ను బెయిల్ పై విడుద‌ల చేశారు.

చెన్నైలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ మద్యం విక్రయాలు నిలిపి వేసింది. ఈ క్ర‌మంలో సినీ న‌టి ర‌మ్య‌కృష్ణ కారులో మ‌ద్యం బాటిళ్లు దొర‌క‌‌డం చర్చనీయాంశంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం బాటిళ్లు లభించడంతో కారును కూడా సీజ్ చేశారు పోలీసులు. ఈ మద్యం బాటిళ్ల విషయంపై రమ్యకృష్ణ స్పందించలేదు.
లాక్ డౌన్ ఎత్తి వేసిన  అనంతరం వైన్ షాపుల ముందు జనం కిక్కిరిసి పోయి బారులు తీరడంతో నియంత్రణ కష్టంగా మారి తిరిగి షాపులు మూసి వేశారు. తమిళ నాడులో వైన్ షాపులు మూతపడడంతో పొరుగు రాష్ర్టాల నుండి మద్యం అక్రమ రవాణ జరుగుతోంది. అక్రమ రవాణ జరగకుండా పోలీసులు చెక్ పోస్టులు, టోల్ ప్లాజాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేయగా రమ్యకృష్ణ కారులో మద్యం బాటిళ్లు బయట పడ్డాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు