బాబొచ్చాడు…

జిల్లా సరిహద్దులో నాయకుల స్వాగతం
జిల్లా నేతలతో బాబు బేటి
:టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ద్వారా శుక్రవారం రాత్రి 8:10నిమిషాలకు జిల్లా సరిహద్దు అయిన చిట్యాల మండలం వెల్లంపల్లి గ్రామ సమీపం నుంచి బాబు యాత్ర జిల్లాకు చేరుకుంది. ఈ సందర్బంగా వెల్లంపల్లి గ్రామ సమీపంలో జిల్లా తెలుగుదేశం ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, సత్యవతిరాథోడ్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, జిల్లా పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఎడబోయిన బస్వారెడ్డి, ఈగ మల్లేశం, నియోజకవర్గ ఇంచార్జీల బాబుకు ఘనస్వాగతం పలికారు. స్వాగత కార్యక్రమం అనంతరం బాబు జిల్లా సరిహద్దు నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న వెల్లంపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి పాదయాత్రలో చేరుకున్నారు.
– జిల్లా నేతలతో బాబుల భేటి…
వెల్లంపల్లి గ్రామ సమీపంలో బస చేసే ముందు చంద్రబాబు జిల్లా నేతలతో భేటి అయ్యారు. అఖిలపక్షానికి ముందు తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేయకున్నా కరీంనగర్ జిల్లా నాయకులు ఆ జిల్లాలో యాత్రను దిగ్విజయం చేశారు. ఇప్పుడు అఖిలపక్షంలో స్పష్టమైన వైఖరి తెలంగాణకు అనుకూలమని చెప్పడం జరిగింది. ఈ అనకూల ప్రకటనతో యాత్రను కరీంనగర్ జిల్లా కంటే మరింతగా విజయవంతం చేసేవిధంగా నాయకులందరు కలిసి పనిచేయాలని బాబు జిల్లా నాయకులకు సూచించారు. తెలంగాణపై పార్టీ వైఖరి ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. పార్టీపై దుష్ప్రచారం చేసే పార్టీలకు పాదయాత్రతో జవాబు చెప్పే విధంగా జన సమీకరణ చేయాలని బాబు జిల్లా నేతలతో మాట్లాడినట్లు తెలిసింది.
– నేడు వెల్లంపల్లి నుంచి సుబ్బక్కపల్లి వరకు యాత్ర…
బాబు పాదయాత్ర శనివారం చిట్యాల మండలం వెల్లంపల్లి నుంచి ప్రారంభమై దుబ్బాక, రాఘవరెడ్డిపేట, అంకుషాపురం గ్రామాల్లో యాత్ర సాగుతుంది. సుబ్బాకపల్లి గ్రామ సమీపంలో రాత్రికి బసచేయనున్నారు. ఆదివారం ఉదయం సుబ్బక్కపల్లి గ్రామం నుంచి పాదయాత్ర మొదలవుతుంది.
December 29, 2012

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు