నడిచీనడిచీ ఆరికాళ్ల నుంచి రక్తం.. పాత చెప్పులు ఇవ్వాలని కనపడ్డవారందరినీ అడిగిన కూలీ


ఉత్తరప్రదేశ్‌లో ఘటన
గుజరాత్‌లోని సూరత్ నుంచి వెళ్లిన కూలీ
300 కిలోమీటర్ల దూరం నడవడంతో చెప్పులు తెగిపోయిన వైనం
అయినా నడక ఆపని కూలీ

లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగించడంతో సొంతూళ్లకు వెళ్లడానికి పేదలు, కూలీలు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. కాలినడకన సొంత గ్రామాలకు వెళ్తున్న వారి పరిస్థితులు చెప్పులు అరిగేలా కాదు.. పాదాలే అరిగిపోతున్నాయా? అనేలా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా ఓ కూలీ పడ్డ బాధ నిలుస్తోంది. నడిచీనడిచీ అతడి అరికాళ్ల నుంచి రక్తం వచ్చింది. దీంతో రోడ్డు పక్కన ఎవరు కనబడితే వారిని చెప్పులు ఇవ్వాలని అడిగాడు.  ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో పిప్‌రైచ్ గ్రామానికి చెందిన తిలోకి కుమార్ పడ్డ ఈ ఇబ్బందులు మీడియా దృష్టికి వచ్చాయి.

గుజరాత్‌లోని సూరత్ నగరంలోని వస్త్ర పరిశ్రమలో తిలోకి కుమార్ పనిచేశాడు. శ్రామిక్ రైలులో ప్రయాణానికి తన పేర్లు నమోదు చేసుకొని వారం రోజులు గడిచినా ఎవరూ స్పందించకపోవడంతో తోటి కార్మికులతో కలిసి స్వగ్రామానికి కానినడకనే బయలుదేరాడు.

దాదాపు 300 కిలోమీటర్ల దూరం నడిచాక తన కాళ్లకు ఉన్న చెప్పులు పూర్తిగా అరిగిపోయి, తెగిపోయాయని చెప్పాడు. అరికాళ్ల నుంచి రక్తం వస్తోందని చెప్పాడు. ఆయన చెప్పులకోసం పలువురిని అడిగిన తీరు అక్కడి వారిని కలచివేసింది. దారి మధ్యలో కొందరు అన్నం, నీళ్లు అందిస్తున్నారని, అయితే, తన కాళ్లకు చెప్పులు లేవని దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు.

చెప్పులు అడిగితే కొందరు కొనుక్కోవాలని డబ్బులు ఇవ్వబోయారని, అయితే, దుకాణాలు బంద్‌ ఉన్నాయని ఎక్కడ కొనుక్కోవాలని ప్రశ్నిస్తూ ఆయన డబ్బులు తీసుకోలేదు. చివరకు ఓ వృద్ధులు లక్నో శివారులో ఓ షాపు నుంచి చెప్పులు కొని తిలోకి కుమార్‌తో పాటు వలస కార్మికులందరికీ చెప్పులు అందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు