ఇది రాచకొండ విశ్వనాధ శాస్ర్తి 1972 లో రాసిన కథ. ఈ కథలో
కొట్టేవాడే ప్రభువు, మొత్తే వాడే రాజు, దెబ్బకి దెయ్యం దడుస్తుంది అని పాలకుల పట్ల ప్రజలకుందే మానవాతీత ఆరాధన, భక్తి, భయం అన్నీ ఎలా ఏర్పడతాయో చెప్పేరు.
ఒకనాడు, చిక్కిపోయిన ఒకానొక బక్క కొంగ చెరువుగట్టున ఒంటికాలిమీద నిలబడి భగవంతుడ్ని ఉద్దేశించి ఈ విధంగా ప్రార్ధించిందిట.
కొట్టేవాడే ప్రభువు, మొత్తే వాడే రాజు, దెబ్బకి దెయ్యం దడుస్తుంది అని పాలకుల పట్ల ప్రజలకుందే మానవాతీత ఆరాధన, భక్తి, భయం అన్నీ ఎలా ఏర్పడతాయో చెప్పేరు.
ఒకనాడు, చిక్కిపోయిన ఒకానొక బక్క కొంగ చెరువుగట్టున ఒంటికాలిమీద నిలబడి భగవంతుడ్ని ఉద్దేశించి ఈ విధంగా ప్రార్ధించిందిట.
“దేవా! ఆరు దినాల నుంచీ ఒక్కగానొక్క చచ్చు పుచ్చు చేపైనా దొరక్క ఆకలితో నేను అలమటించి పోతున్నాను
నేను దీనుడ్ని, హీనుడ్ని కానీ పాపిని మాత్రం కాను ఈ దినం నాకు ఏ చేపనైనా సరే ఎలాగైనా సరే ప్రసాదించి
నీ ఈ భక్తుడ్ని రక్షించు దేవ దేవా! దేవా!దేవా! “ అని పాపమా బక్క చిక్కిన బొక్కి కొంగ భగవంతుడ్ని ప్రార్ధించిందిట.
బెదురుతూ, మనసంతా చెదిరిపోయిన ఓ చిరు చేప, చెరువులో ఓ మూల నిలబడి దేవదేవుడ్ని ఆ దినం దీనాతిదీనంగా ఈ విధంగా వేడుకుందిట.
“దేవుడా! రావుడా! కొంగల భయానికి నా గుండెలు బద్దలవుతున్నాయి. నా తల్లి తండ్రే కాదు. మా తల్లులు
తండ్రులు, మా బిడ్డలు పాపాలు అందరం కొంగలకి ఆహుతైపోతున్నాము. మేం గంటకి వెయ్యి మందిమిపుడితే అరగంటకి వెయ్యి మందిమి కొంగల కడుపుల్లోకి పోతున్నాం ప్రభూ, ప్రభూ! ఈ కొంగల బారి నుంచి మమ్మల్ని కాపాడవా ప్రభూ!” అని పాపమా చిరు చేప చెరువు బురద నీటిలో వేడి నిట్టూర్పులు విడుస్తూ భగవంతుడ్ని వేడుకొందిట.
అపుడు ఆ చిరు చేప ప్రార్ధన విన్న మరొక చేప( వంద వలల్నీ, మూడు వందల ముక్కుల్నీ తప్పించుకు వచ్చిన చురుకు చేప) వికటంగా నవ్వి ఈ విధంగా ఆ చిరు చేపతో చెప్పిందిట.
“ఒసే చిరు చేపా! ఓసీ నా వెర్రి చేపా! కొంగల్ని పుట్టించిన వాడు చేపల్ని ఎలా రక్షిస్తాడ నుకున్నావే? కొంగల దేముడు దొంగల దేముడు కాదా, అటువంటి వారు మనల్ని ఎన్నటికీ రక్షించడు, రక్షించడు, రక్షించడు ఇది ముమ్మాటికీ నిజం! నా మాట నమ్ము!” అని వికటంగా నవ్వి, వేదాంతిలా చెప్పిందిట ఆ చురుకు చేప.
అయితే – ఆ మరొక చేప మాటల్ని నమ్మడానికి పాపమా ఆ చిరుచేపకి అవకాశం లేకపోయిందట. ఎందుచేతంటే, ఆ మాటల్ని పూర్తిగా వినే లోపున ఆ చిన్నారి చిరు చేప, భగవండుడ్ని ప్రార్ధించిన బక్క కొంగకి భోజనంగా మారి పోయిందిట.
0000
సంస్కృత దైవం, తెలుగు దయ్యం ఎవరి ప్రార్ధనలు వింటాడో ఎవరివి వినదో ఎవడికి తెలుసు? కాని కొంగలు కొంగలే. చేపలు చేపలేనని చేపలు తెలుసుకుంటే బతుకు బురదనీతిలో చావు దారి తప్పించుకుందికి, బతుకు బాట తెలుసుకోండికి, చేపలకాపాటి చిరు జ్ఞానం చాలు.
-రాచకొండ విశ్వనాథశాస్త్రి
(1972 నాటి కథ)
0 వ్యాఖ్యలు
Please Do not enter any spam link in the comment box