గిదేం పని సీఎస్?

మహంతి వ్యవహారంపై వివాదం

-పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమే
-గడువు పెంపు విషయంలో అత్యుత్సాహం
-పదవీకాలం పొడిగింపు కోసమేనా?
-తగదంటున్న రాజ్యాంగ నిపుణులు
హైదరాబాద్, జనవరి 24:ముసాయిదా బిల్లు విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతున్నది. సీఎస్ రాజ్యాంగ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు తార్కాణంగా ఆయన బిల్లుపై చర్చను పొడిగించాలని లేఖ రాసినట్టుగా వచ్చిన మీడియా కథనాలను రాజకీయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలైన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీల్లో ఒకరి పరిధిలోకి మరొకరు రావటం రాజ్యాంగ వ్యతిరేకమని వారంటున్నారు. ఎవరి పరిధిలో వారు తమ తమ విధులను నిర్వర్తించటం ఆనవాయితీగా వస్తున్నది. ముసాయిదా బిల్లుపై ఏదైనా సమాచారం పంపించాలనుకుంటే అసెంబ్లీ స్పీకర్ లేదా కౌన్సిల్ చైర్మన్ ఒక నిర్ణయం తీసుకుంటారు. అది కూడా సభ్యుల ఏకాభిప్రాయం లేదా మెజారిటీ సభ్యుల కోరిక మేరకు చర్యలు తీసుకుంటారు తప్పితే సీఎస్‌కు ఈ వ్యవహారంలో ఎలాంటి పాత్ర ఉండకూడదనేది రాజ్యాంగ నిపుణుల భావన. ఎగ్జిక్యూటివ్‌లో భాగమైన చీఫ్ సెక్రటరీ ఈ లేఖను పంపించి ఉన్నట్టయితే తనకు సంబంధం లేని శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారి మెప్పు కోసం, తన పదవీ విరమణ సమయం సమీపిస్తుండటంతో మరో మూడునెలలపాటు పదవిని పొడిగించుకోవటం కోసం ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ మంత్రివర్గ నిర్ణయం లేకుండానే సొంతంగా కేంద్రానికి వివరాలు పంపారని ఆయనపై దుమారం రేగింది. కొందరు మంత్రులు కూడా సీఎస్‌పై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు.
కేబినెట్ నిర్ణయాలను మాత్రమే ఆయన కేంద్రానికి పంపించాల్సి ఉంటుందని, ఆయన రాష్ట్ర కేబినెట్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తారు తప్పితే తుది నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు లేదని వ్యాఖ్యానించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో బిల్లుపై చర్చ సమయాన్ని పొడిగించాలని ప్రత్యేకంగా లేఖ ద్వారా సీఎస్ కోరినట్టుగా వార్తలొచ్చినా దీనిపై మహంతి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. సీఎస్ వాటిని ఖండించకపోవడంతో ఆయనే లేఖ రాసినట్టు ఢిల్లీలోనూ ప్రచారం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దానిని ధవీకరించారు. రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేనందున తాను ముఖ్యమంత్రి సూచించినా మరో నాలుగు వారాల గడువు పొడిగింపు కోరుతూ లేఖ రాయలేదని బీఏసీ సమావేశంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. అయితే ఎగ్జిక్యూటివ్ హోదా మాత్రమే ఉన్న చీఫ్ సెక్రటరీ ఇందులో ఎలా జోక్యం చేసుకుంటారనేది చర్చనీయమైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు