సిన్మా షూటింగ్స్ ఇక షురూ ..కెసిఆర్ గ్రీన్ సిగ్నల్

ధియేటర్లకు మాత్రం అనుమతులు లేవు
కరోనా నిభందనలు పాటిస్తూనే సిన్మా ప్రొడక్షన్ పనులు
కెసిఆర్ ను కల్సిన సిని ప్రముఖులు
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సినిమారంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు  చిరంజీవి, శ్రీ నాగార్జున,  డి. సురేష్ బాబు, అల్లు అరవింద్,ఎన్. శంకర్,  రాజమౌళి, దిల్ రాజు,  త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్,  రాధాకృష్ణ, కొరటాల శివ, శ్రీ సి. కల్యాణ్,  మెహర్ రమేశ్, శ్రీ దాము తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు.
సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సీఎం అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు