తెలంగాణ’కు రాజ్యాంగ అడ్డంకులుండవు

(విశాలాంధ్ర)తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభ అను కూల తీర్మానం లేకపోయినా అది, రాజ్యాంగ ప్రక్రియకు ఎంత మాత్రం అడ్డంకికాబోదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు శాసనపరమైన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లు ప్రస్తుతం శాసనసభలో వున్నది. ఆ తర్వాత పార్ల మెంట్‌కు వెళుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కొన్ని రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవి -రాష్ట్ర శాసన సభ తీర్మానం లేకుండా విభజన చేస్తారా? అనేది ఒకటి. శాసనసభ సిఫార్సు లేకుండా, తెలంగాణ ఏర్పా టుకు పార్లమెంట్‌ తీర్మానం చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అనేది రెండవ ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలు కూడా భారతదేశ సమాఖ్య వ్యవస్థపై తప్పుడు ప్రేరణతో రాజ్యాం గంపై తలెత్తుతున్న పరస్పర విరుద్ధమైన తప్పుడు ఆలోచ నలు ఎంతో మేథోమధనంతో రూపొందిన కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, కుత్సిత రాజకీయ పక్షపాతానికి తరచుగా గురికావడం ఈ ఆలోచనలకు ప్రేరణ అనిచెప్పవచ్చు. రాష్ట్రాల సరిహద్దుల మార్పునకు కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయనేది నిర్వివాదాంశం. ఈ అధికారాలలో రాష్ట్రపతి గాని, సుప్రీంకోర్టుగాని జోక్యం చేసుకోవడమనేది సమాఖ్య వ్యవస్థకుగాని, రాజకీయ ఐక్యతకు గాని ఏ మాత్రం దోహ దం చేయదు. అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏవీలేవని గట్టిగా చెప్పగలు గుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుగుణంగా సరిహద్దుల మార్పిడికి శాసనసభ పరిశీలన కోసం రాజ్యాం గంలోని 3వ ఆర్టికల్‌ కింద పంపిన బిల్లును శాసనసభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించినా లేదా ఏ అభిప్రాయం తెలుపకుండా తిప్పిపంపినా ఆ బిల్లు చెల్లుబాటు కాదనే వాదన గట్టిగా వినిపిస్తున్నది. కానీ, ఈ విషయంలో సర్వో న్నత న్యాయస్థానం అనేక సందర్భాలలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. విభజన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించినా, తిరస్కరించినా ఆ బిల్లును చట్టం చేయడానికి కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయని, శాసనసభ అభిప్రాయం రాజ్యాంగప్రక్రియకు ఎంతమాత్రం అడ్డంకిగా వుండబోదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొన్నది.
బాబూలాల్‌పరాటే (1959) కేసులో అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి తొలుత మహారాష్ట్ర- గుజరాత్‌రాష్ట్రాలుగా విభజన, బొంబాయి కేంద్రపాలిత ప్రాంతంగా పేర్కొంటూ రాష్ట్ర శాసనసభకు విభజన బిల్లు పంపారు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. అయితే, ఆ తర్వాత బిల్లును సవరిస్తూ, బొంబాయి మహారాష్ట్రలో భాగంగా వుండే విధంగా పార్లమెంట్‌ తీర్మానం చేసింది. దీనిపై కొంత రాజకీయ గందరగోళం చెలరేగింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాబూలాల్‌ పరాటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పార్లమెంట్‌ ఏకపక్షంగా సవరణ తీర్మానం చేసిందనడం చెల్లదని, విభజనపై కేంద్రానికే రాజ్యాంగం సర్వాధిóకారాలు కట్టబెట్టిందని తీర్పు చెప్పి కేసును కొట్టి వేసింది. కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు సవాల్‌ చేయడానికి అధికారాలు కూడా లేవని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నది. అదే విధంగా రాష్ట్ర సరిహద్దుల మార్పిడికి కేంద్రానికి సర్వాధికారాలు వున్నా యని కూడా సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో స్పష్టం చేసింది. ఉత్తరాంచల్‌ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కేవలం హరిద్వార్‌ నగరాన్ని ఉత్తరాంచల్‌లో భాగం చేయాలని రాష్ట్రశాసనసభ తీర్మానం చేసింది. కానీ, హరిద్వార్‌ జిల్లా భూభాగాన్ని మొత్తం ఉత్తరాంచల్‌లో కలుపుతూ పార్లమెంట్‌ తీర్మానించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ప్రదీప్‌ చౌదరి 2009 లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ, కేంద్రం అధికారాన్నే సుప్రీంకోర్టు సమర్ధించింది. అందువల్ల తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించినా, తిరస్కరించినా విభజన ప్రక్రియ నిలిచి పోదనే విషయం స్పష్టం . ఒక వేళ రాజ్యాంగంలోని 3వ పరిచ్ఛేదనం నిర్వచనాన్ని సుప్రీం కోర్టు గనుక మారిస్తే పరిస్థితి వేరే రకంగా వుండే అవకాశం వున్నది. తెలంగాణ ఏర్పాటులో రాజ్యాంగాన్ని వ్యతిరేకిం చడం ఎట్టి పరిస్థితులలోనూ కుదరదు. కాకపోతే, విభజన విషయంలో రాజ్యాంగం ఏ విధంగా వుండాలనే విష యంలో వాదనలెన్నైనా చేయవచ్చు. శాసనసభ అభిప్రా యాన్ని పార్లమెంట్‌ ఖచ్చితంగా గౌరవించాలనే విషయంలో రాజ్యాంగం 3వ ఆర్టికల్‌లో ఎక్కడా పేర్కొనలేదు. నిజానికి, శాసనసభ అభిప్రాయాలను పార్లమెంట్‌ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలనడం మన సమాఖ్య వ్యవస్థకు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కూడా కలిగించనున్నది. భారతదేశంలో అంతర్భాగమైన రాష్ట్రాలకు సార్వ భౌమా ధికారాలు గాని, స్వతంత్రంగా వ్యవహరించే అధికారం గాని లేదని సుప్రీంకోర్టు బాబూలాల్‌ కేసులో స్పష్టం చేసింది. మొత్తం దేశ ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌కు కొత్తరాష్ట్రాల ఏర్పాటు అధికారం, రాష్ట్ర సరి హద్దులలో మార్పులు-చేర్పులు అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ మేరకు, కేంద్రానికి కార్యనిర్వా హక అధికారం ఉన్నదని కూడా కోర్టు స్పష్టంచేసింది. శాసనసభ కాని, లెజిస్లేచర్‌ ఉభయ సభలు కాని, ప్రతి పాదనపై అభిప్రాయాల వెల్లడివరకే పరిమితం. కేంద్రం అధికారాలకు కత్తిరింపులు వేయడానికి రాష్ట్రపతిగాని, సుప్రీంకోర్టుగాని ప్రయత్నించినా భారతదేశ సమాఖ్య వ్యవస్థపై భవిష్యత్తులో అదిదుష్ప్రభావాలను చూపే అవకా శం వుంటుంది. సమాఖ్య వ్యవస్థను కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు సమానబాధ్యతతో పటిష్టపరచడానికి కృషి చేయాలి. రాజకీయ లబ్దికోసం, పక్షపాత వైఖరితో కేంద్రం రాష్ట్రాలను విభజించబూనుకోవడం అనేది వుండకూడదు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవిభ జనకు పూనుకొన్నదనే వాదనలు కూడా వున్నాయి. అయితే రాజకీయ లబ్ది కోసమో, పక్షపాత వైఖరితోనో రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొన్న సందర్భాలు కూడా వున్నాయి. ప్రాంతీయ ఆత్యయిక పరిస్థితి విధించినప్పుడుగాని, రాజ్యాంగంలోని 356వ ఆర్టికల్‌ ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు గాని, గవర్నర్ల నియామకం, గవర్నర్లు విచక్షణా రహితంగా తమ అధికారాలను వినియోగించినప్పుడుగాని, రాష్ట్రాల్లో శాంతి-భద్రతల పరిరక్షణ పేరుతో కేంద్రం అధికారం చెలాయించినప్పుడుగాని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రాజ్యాంగహక్కులు నిష్పాక్షిక వినియోగానికి మార్గదర్శకాలు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. అయినా, మన వ్యవస్థలో, పక్షపాత వైఖరితో కూడి ఫెడరలిజం, అపుడప్పుడు కొరడా ఝుళిపిస్తున్నదనేది కాదనలేని సత్యం. అయితే, ఫెడరలి జంపై గగ్గోలు పెడుతున్నది మాత్రం కేంద్రంలో అధికా రంలో లేని రాజకీయ పక్షాలే అధికం. ఏమైనా, కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో మాత్రం పక్షపాతవైఖరి, లేదా రాజకీయ లబ్ధి కోసం అనే అపవాదుకు తావివ్వ కుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం వున్నది. దేశంలో ఇప్పుడు కొత్తరాష్ట్రాల వాదనలు అనేకం వినిపి స్తున్నాయి. ఈ విషయంలో రాజకీయ ప్రేరణతో ప్రజలు ప్రత్యేకరాష్ట్ర్రం అంటున్నారా? వెనకబాటుతనం, అణిచి వేతకు గురై ప్రత్యేక ఆకాంక్షను బలంగా వినిపిస్తున్నారా అనేది జాగ్రత్తగా గమనించవల్సిన అవసరం వున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల చాలా మేరకు ప్రయోజనమే చేకూరిందని చెప్పాలి. దీనివల్ల, అనేక ప్రాం తీయ పార్టీలు ఆవిర్భవించడానికి అవకాశం కలిగింది. తమిళనాడులో ద్రవిడ పార్టీలు, మహారాష్ట్రలో శివసేన, సిక్కులు అధికంగా వుండేే పంజాబ్‌లో అకాలీ పార్టీలు లబ్దిపొందాయి. రాజకీయ స్వయం ప్రతిపత్తి కోసం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లు పెరుగుతూనే వున్నాయి.
తెలంగాణ ఆకాంక్ష : తెలంగాణ ఆకాంక్షను వేరే కోణం నుంచి చూడాల్సిన అవసరం వున్నది. ఈ ప్రాంతం అభి వృద్ధి నిర్లక్ష్యానికి గురికావడమే ప్రత్యేక తెలంగాణ అనే ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజల్లో బలపడిందని జస్టిస్‌ శ్రీకృష్ట కమిటీ కూడా పేర్కొన్నది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా చేసుకొన్న పెద్ద మనుషుల ఒప్పందం అమలుకు నోచు కోలేదు. ఉద్యోగాలు, విద్య విషయంలో చేసుకున్న షట్సూ త్ర పథకం కూడా నిర్లక్ష్యానికి గురైంది. విద్య, ఉపాధి, పదవుల విషయంలో అంతులేని నిర్లక్ష్యానికి గురై నందున, ఏ ఒప్పందం కూడా సరిగా అమలు కానందునే ఆ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష బలంగా నాటుకు పోయింది. ప్రత్యేక రాష్ట్రం వల్ల తెలంగాణలో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధిపొందవచ్చుగాని, ఈ ఆకాంక్ష ప్రాంతం వారీగా పెరిగింది తప్ప పార్టీల ఆధారంగా పెరి గిందనేది నిజం కాదు. ప్రత్యేక తెలంగాణ వాదం ఒక రకంగా, అణిచివేత, నిర్లక్ష్య విధానాలనుంచి పుట్టు కొచ్చిందనే చెప్పాలి. ఏదైనా, తెలంగాణ ఏర్పాటుకు శాసన, రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితులలో రాష్ట్రపతి గాని, సుప్రీంకోర్టు గాని దాన్ని నిలువరించే ప్రయత్నం చేయరనేది మాత్రం సత్యం. రాజ్యాంగ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యం.
– సుధీర్‌ కృష్ణస్వామి- ది హిందూ సౌజన్యంతో
(రచయిత అజీవ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ లా ప్రొఫెసర్‌, అంబేద్కర్‌ యూనివర్శిటీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌, కొలంబియా లాస్కూల్‌లో ఇండియన్‌ కానిస్టిట్యూషనల్‌ లా ప్రొఫెసర్‌)
January 5, 2014

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు