ఇదీ సేద్యం భూమి

3,01,60,000(అక్షరాలా మూడు కోట్ల ఒక లక్ష అరవై వేల ఎకరాలు)
-1955 నాటికి హైదరాబాద్ స్టేట్‌లో ఇదీ సేద్యం భూమి
-15,72,152 ఎకరాల్లో వరి, 30,35,843 ఎకరాల్లో పత్తి
-బూర్గుల పాలనలో 51 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు
-రాష్ట్రం కొనసాగివుంటే తెలంగాణ స్వర్ణయుగం చూసేది
కష్ణా, గోదావరి జీవనదులు వందల ఏళ్లుగా తెచ్చిపడేసిన ఒండ్రుమట్టితో.. కాకి రెట్టవేసినా కల్పవక్షాలు పుట్టుకొచ్చే నేలమీద, కాటన్‌దొర నీళ్లిస్తే పంటలు పండించి.. మాకన్నా మొగోళ్లు లేరని కలరింగులిస్తారు సీమాంధ్రనేతలు. 19వ శతాబ్దపు తొలిపాదంలో క్యూలు కట్టి రంగూన్ ఎర్రరంగు రేషన్‌బియ్యం ఎగబడి తిన్న మాట మరిచి, యాభై దశకంలో రాయలసీమ కరువుకు జనం పిట్టల్లా రాలిపోతుంటే ప్రధాని నెహ్రూ అంతటివాడు రెండు రోజులు మకాం వేసి సైన్యంతో సాయం చేయించిన చరిత్ర విస్మరించి సీమాంధ్ర జిల్లాలన్నీ వ్యవసాయ మహావైభవాన్ని అనుభవించినట్టు .. తెలంగాణకు సేద్యమే తెలియదన్నట్టు ప్రచారహోరు. కష్ణా జిల్లాలో ఎకరం పదివేలు పలికేది.. తెలంగాణ జిల్లాల్లో వెయ్యి, రెండువేలు కనాకష్టంగా ఉండేదని ఎద్దేవాచేసే నాయకులు.. మరి అదే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎకరం పది రూపాయలైనా చేసేదా?… అనంతపురం జిల్లాలో ఎదురు డబ్బిచ్చినా తీసుకునేవాడు దొరికేవాడా? అంటే నోరు మెదపరు. చరిత్ర చాలా గడుసుది. ఎవరి నిర్వచనాలకూ లొంగదు. మనకు తీపిగా ఉన్నా..చేదుగా ఉన్నా వాస్తవాలనే నమోదు చేస్తుంది. అలాంటి వాస్తవమే ఇది. 1955 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో సేద్యంకింద భూమి అక్షరాలా మూడుకోట్ల ఒక లక్ష అరవై వేల ఎకరాలు! బూర్గుల నేతత్వంలోని ఆనాటి తెలంగాణ ప్రభుత్వం సాధించిన అదనపుసాగు 51 లక్షల 28వేల ఎకరాలు!(సవాల్‌రెడ్డి)

:స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌లో బూర్గుల రామకష్ణారావు నేతత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన అభివద్ధి తెలంగాణకు స్వర్ణయుగమే. వాస్తవానికి పోలీస్‌యాక్షన్ అనంతరం హైదరాబాద్‌లో శాంతిభద్రతలు దారుణస్థాయికి పడిపోయాయి. దానికి తోడు పోలీస్‌యాక్షన్ తాలూకు ఖర్చులతో పాటు మద్రాసు నుంచి తీసుకొచ్చిన ఉద్యోగుల జీతాలు కూడా కేంద్రం రాష్ట్రం మీదే రుద్దింది. దీనితో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆనాటి దుర్భరస్థితి నుంచి బూర్గుల ప్రభుత్వం నెగ్గుకురాగలిగింది. ఆహార సమస్యను ఆనాడు దేశమంతా ఎదుర్కొన్నది. దానినుంచి రాష్ర్టాన్ని ఒడుపుగా తప్పించగలిగింది. ఒకవైపు నిజాంసాగర్, మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు కాల్వల పనులు పూర్తిచేసింది.
ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకుని నాగార్జునసాగర్ పనులకు నిధులు విడుదల చేసింది. ఇంకోవైపు రాష్ట్రంలోని వేల చెరువుల బాధ్యత తీసుకుంటూనే గోదావరి లోయ, అప్పర్ కష్ణా,భీమ, పెన్‌గంగా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు సంబంధించిన సర్వే పనులు పరుగులు పెట్టించింది. వ్యవసాయ అభివద్ధికి ప్రామాణికతగా భావించే ఎరువుల వాడకం విస్తతపరిచింది. ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న జపాను వరిసేద్యం పద్ధతిని లక్షా 92 వేలకు పైగా ఎకరాల్లో సాగుకు తెచ్చింది. నెహ్రూ ప్రభుత్వం చేపట్టిన కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమం ప్రశంసనీయంగా అమలుచేసిన రాష్ర్టాల్లో హైదరాబాద్ ఒకటి. రజాకార్ల కార్యకలాపాల సందర్భంగా, ఆ తర్వాత పోలీస్‌యాక్షన్ సందర్భంగా నెత్తుటి ఏరులు పారిన గుల్బర్గాలో ఈ కార్యక్రమం అమలుతీరును భారత ప్రభుత్వ కమ్యూనిటీ ప్రాజెక్టుల అడ్మినిస్ట్రేటర్ ఎస్‌కే డే మెచ్చుకుని మోడల్ యూనిట్‌గా ప్రధానమంత్రికి సిఫార్సు చేశారు.
ఇదీ వ్యవసాయ రంగం..
1948 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో సేద్యంకింద ఉన్న భూమి 2,50,32,000. 14 లక్షల 19వేల ఎకరాల్లో వరి, నాలుగు లక్షల 85 వేల ఎకరాల్లో గోధుమ, 75 లక్షల పై చిలుకు భూమిలో మొక్కజొన్న, 29 లక్షల 36వేల ఎకరాల్లో వేరుశనగ, 21 లక్షల 56వేల ఎకరాల్లో పత్తి పండేది. 17 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉండేది. 8 వేల మేజర్ చెరువులు, 25 వేల చిన్న చెరువులు ఉండగా ఆరువేల మైళ్ల పొడవైన కాల్వలు ఉండేవి.
– (ది హైదరాబాద్ గవర్న్‌మెంట్ బులిటిన్ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ 1948)
1952లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టుల మీద దష్టి కేంద్రీకరించారు. 1955 నాటికి మొత్తం 3,01,60,000 ఎకరాలను ప్రభుత్వం సేద్యం కిందికి తెచ్చింది. 1948తో పోలిస్తే ఇది 51,28,000 అదనం. ఆ నాటి ప్రాజెక్టుల విషయానికి వస్తే తుంగభద్ర ప్రాజెక్టు మద్రాసు, హైదరాబాద్ రాష్ర్టాల ఉమ్మడి కషి. ఆ ప్రాజెక్టు ఎడమకాలువ హైదరాబాద్ రాష్ర్టానికి నీరందించేది. హైదరాబాద్ రాష్ర్టానికి 5,80,000 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు నిధులు అందించారు. 1953 జూన్‌లో నీరందించడం ప్రారంభమైంది. 1955 నాటికి 1.28.700 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరిపారు. 122.02 కోట్ల వ్యయంతో చేపట్టే నాగార్జునసాగర్‌కు ప్రాథమిక పనులు పూర్తి చేశారు. లక్ష ఎకరాల అంచనాతో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ చేపట్టారు. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టు ఉంది. వీటికి తోడు 2,28,780 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 16 ప్రాజెక్టులు 12.64 కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటిలో బెందుసురా, కోయల్‌సాగర్, ఖాసాపూర్ ప్రాజెక్టులు ఉన్నాయి. గోదావరి ప్రాజెక్టు, ఎగువ కష్ణా, భీమా, పెన్‌గంగా ప్రాజెక్టుల సర్వే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుల కింద ప్రతిపాదించిన సాగు 53 లక్షల ఎకరాలు. పాతవి కొత్తవీ కలపి మొత్తం ప్రాజెక్టుల కిందే 71.14 లక్షల ఎకరాలు సాగు కాగలవనేది నాటి అంచనా.list2
18 వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, క్షేత్రాలు
నాటి హైదరాబాద్ రాష్ట్రంలో 18 వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాలు పనిచేసేవి. హిమయత్‌సాగర్, డిండి, వరంగల్‌లో వరి, ముథోల్త్, లాథూర్, పర్భణి కేంద్రాల్లో పత్తి పరిశోధనా కేంద్రాలు మేలైన రకాలు ఉత్పత్తి చేశాయి. బద్నాపూర్‌లో గోధుమ, రుద్రూర్, వరంగల్, కరీంనగర్ లలో మొక్కజొన్న, నూనెగింజలపై పరిశోధనలు జరిగాయి. రాజేంద్రనగర్‌లో పచ్చి ఎరువు పైర్లు, వక్ష సంబంధమైన పైర్ల అభివద్ధి జరిగింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పంటలపోటీ పథకం 1950నుంచే ఇక్కడ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలోని 18 వ్యవసాయ మార్కెట్లకు 1954 కంటే 1955లో అంటే ఒక సంవత్సర కాలంలోనే 39 లక్షల పల్లాల అదనపు ధాన్యం అమ్మకానికి వచ్చింది.

విద్య..
తెలంగాణలో విద్య స్థితిగతులపై వివిధ రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే బూర్గుల హయాంలో విద్యరంగ అభివద్ధికి విశేష కషి జరిగింది. ఫలితంగా 1955 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో 12,975 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యాయి. 500 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి కనీసం ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. 8.50 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసించేవారు. 200 జూనియర్ బేసిక్ స్కూళ్లు పనిచేశాయి. 680 లోయర్ సెకండరీ స్కూళ్లు, 287 హైయ్యర్ సెకండరీ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. 3 బిఎడ్ కళాశాలలు, 14 సెకండరీ గ్రేడ్ శిక్షణా కేంద్రాలు, 4 బేసిక్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నిజామాబాద్, నాందేడ్, రాయచూర్‌లో బాలుర ఐటిఐలు, వరంగల్, ఔరంగాబాద్, గుల్బర్గాలో బాలికల ఐటిఐలు ఉండేవి. హైదరాబాద్‌లో సెంట్రల్ క్రాప్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటైంది. 3 ప్రాంతీయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు.
భూసంస్కరణలకు నాంది పలికిన హైదరాబాద్…
జమిందారీ జాగీర్దరీ వ్యవస్థను కూల్చివేసిన పోరాటం జరిపింది తెలంగాణ అయితే ఆ వ్యవస్థను రద్దు చేసి భూసంస్కరణలు తెచ్చిన తొలిరాష్ట్రం హైదరాబాద్. వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో ఈ భూస్వామ్యవిధానం ఉంది. ఆంధ్రప్రాంతంలో 600 జమీందారులు ఉండేవారు. హైదరాబాద్‌లో జాగిర్దార్ వ్యవస్థ ఉండేది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇలా అనేక ప్రాంతాల్లో ఈ రకమైన వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థను బద్దలు కొట్టిన తొలిరాష్ట్రం హైదరాబాద్. ఆంధ్రలో జమిదారీ వ్యవస్థ రద్దు ప్రతిపాదనలు తయారు చేసి ప్రవేశ పెట్టడానికి దశాబ్దానికిపైగా కాలం పట్టగా అది కోర్టు వివాదాలు దాటి అమలు చేయడానికి మరో రెండు దశాబ్దాలకు పైగా కాలం పట్టింది. కానీ హైదరాబాద్ కొద్ది నెలల్లోనే ఆ వ్యవస్థను రూపు మాపడమే కాదు. భూసంస్కరణలు తెచ్చి పేదలకు భారీగా భూమి హక్కుపత్రాలు పంపిణీ చేసింది.
నాడు దేశం మొత్తానికి భూసంస్కరణ విషయంలో హైదరాబాద్ ఓ రోల్ మాడల్. 1949 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో 1500 జాగీర్లు ఉండేవి. 6.500 గ్రామాలు జాగీర్ల పరిధిలో ఉండేవి. వాటన్నింటినీ హైదరాబాద్ ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ కౌల్దారీ, వ్యవసాయభూముల చట్టం అమలులోకి తెచ్చి సేద్యదారులకు భూయాజమాన్యపు హక్కులు కల్పించింది. అలాగే వివిధ రకాల భూములకు పన్నుల విధానం కూడా అనతికాలంలోనే అమలు చేయగలిగింది. భారత ప్రభుత్వ ఆదేశం మేరకు నాడు దేశమంతా భూమి లెక్కలు సేకరించి క్రమబద్దపరిచే కార్యక్రమం చేపట్టి అన్ని రాష్ర్టాలకన్నా ముందుగా పూర్తి చేసింది.
రాష్ట్రంలో దున్నేవాడిదే భూమి అన్న నినాదం లాగే గీసేవాడిదే చెట్లు నినాదంతో తాటిచెట్లపై గీతకార్మికులకు హక్క కల్పించే పథకం కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1952 ఎనికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వాన్ని స్థంభింప చేసేరీతిలో సమ్మెలు జరుపుతూ వచ్చాయి. వాటన్నింటినీ ఎదుర్కుని ప్రగతి కార్యక్రమాలు చేపట్టింది.

january 25, 2014 (నమస్తే తెలంగాణ)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు