తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌......సిఎం కేసీఆర్‌

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ 
మాస్కులు తప్పని సరి..లేకుంటే వేయి జరిమానా
కేంద్ర ప్రకటించిన పాకేజి బోగస్
మేం అడిగింది ఏంటి మీరు ఇచ్చింది ఏంటి
మండిపడిన కెసిఆర్

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. 1450 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ పరిధిలో ఉన్నాయని సీఎం తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్‌ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని, కరోనాతో జీవించడం నేర్చుకోవాలని అన్నారు సీఎం. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాల‌న్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని అన్నారు. త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ లు ధరించాల‌ని, లేదంటే రూ.1000 జ‌రిమానా విధిస్తామ‌ని సీఎం తెలిపారు.
హైదరాబాద్‌ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని, దుకాణాలలో శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని సీఎం పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో సెలూన్ షాపులు తెరచుకుంటాయని చెప్పారు. ఈ-కామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలు జరపుకోవచ్చన్నారు. అయితే ఫంక్షన్ హాల్స్, థియేటర్లు, మత ప్రార్థనలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. అన్ని రకాల విద్యా సంస్థలు కూడా తెర‌వ‌బ‌డ‌వని అన్నారు. రాత్రివేళల్లో కర్ఫ్యూ యథాతధంగా కొనసాగుతుందన్నారు.

ఇదో బోగస్ ప్యాకేజీ
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కరోనా లాంటి మహమ్మారిపై పోరు చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్‌ అని  కొట్టి పారేశారు.
ఇదో బోగస్ ప్యాకేజీ.. అంకెల గారడీ అని విమర్శించారు. మేం అడిగిందేమిటి? మీరు ఇచ్చిందేమిటి? అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. రాష్ట్రాలను బిచ్చగాళ్లలా చూస్తోందని.. కేంద్రం నియంత‌ృత్వ పోకడలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు
అది ఒట్టి డొల్ల. 100 శాతం ప్యాకేజీ. అంతర్జాతీయ పత్రికలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్లు కూడా లేవు. ఇది దుర్మార్గమైన ప్యాకేజీ. నియంతృత్వ వైఖరితో ఉంది. మేం ఖండిస్తున్నాం. మేం అడిగింది ఇది కాదు. కరోనా లాంటి విపత్తు సమయంలో రాష్ట్రాలకు నగదు కావాలి. అది అడిగితే రాష్ట్రాలను భిక్షగాళ్లలా భావించింది. సంస్కరణలు అమలు చేసే పరిస్థితి ఇదే. 2శాతం FRMB పెంచింది. దాని వల్ల తెలంగాణకు రూ. 20వేల కోట్లు వస్తాయి. అది రాష్ట్రమే కట్టుకోవాలి. దీనికి దరిద్రమైన ఆంక్షలు పెట్టారు. 5వేల కోట్ల తర్వాత ప్రతి రూ.2,500 కోట్లకు ఒక సంస్కరణను ఆంక్షలు పెట్టారు. ప్రజల మెడపై కత్తి పెట్టాలా? ఇది ప్యాకేజా..?

మున్సిపాలిటీల్లో ఛార్జీలు పెంచితే రుణ పరిమితి పెంచుతారా? దీన్ని అసలు ప్యాకేజీ అంటారా? పచ్చిమోసమంటూ ధ్వజమెత్తారు. విపత్తు వేళ కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదని.. వాళ్ల పరువు వారే తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నిబంధనలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామంటే అవి మాకు అక్కర్లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
తెలంగాణ రైతులు నియంత్రిత విధానంలోనే వ్య‌వ‌సాయం చేయాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు పంట‌ను వేసి మంచి ధ‌ర‌ను సాధించా‌ల‌న్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు